గజ్వేల్, డిసెంబర్ 2: గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్‌లను జైలుకు పంపిందని, బిల్లులు అడిగిన పాపనికి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, జగదేవ్‌పూర్, కుకునూర్‌పల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీల నుంచి పలువురు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం రెండేండ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలన తెచ్చి గ్రామాలను ఆగంచేసిందన్నారు.
నిధులు లేక గ్రామాల్లో ఖర్చులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు సెలవులు పెట్టి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం వీధిదీపాల నిర్వహణ లేక గ్రామాలు చీకటిమయం అయ్యాయని, పారిశుధ్యం పడకేసి విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టిన కూడా లేదని హరీశ్‌రావు విమర్శించారు. పారిశుధ్యంలోపంతో గజ్వేల్ ప్రాంతంలో చాలామంది డెంగ్యూతో చనిపోయారని గుర్తుచేశారు. గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్‌ను దేశానికి ఆదర్శంగా కేసీఆర్ తీర్చిదిద్దారని గుర్తుశారు.
పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు చేయడం లేదన్నారు. యాసంగి రైతుభరోసా ఇవ్వడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని, 420హామీలిచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ది చెప్పాలపి, చిత్తుగా కాంగ్రెస్‌ను ఓడించాలని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్ ఆధ్వర్యంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరారు.
కుకునూర్‌పల్లి మండలం రాయవరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ మహేందర్, కమ్మరి రవి, బీఎస్పీ మండల అధ్యక్షుడు కరుణాకర్, రాజు, పరశురాములు, రంగస్వామి, అనిల్, కార్తీక్ కాంగ్రెస్, బీఎస్పీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. గజ్వేల్ మండలం దాతర్‌పల్లికి చెందిన మధు, నరేశ్, కంటే ప్రశాంత్, రమేశ్, రాజు, సిద్దు, కృష్ణ, జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన కీసరి నరసింహ, సర్పంచ్ అభ్యర్థి చేరారు. కార్యక్రమంలో దేవి శ్రీశైలం, తలారి స్వాతిస్వామి, కరుణాకర్‌రెడ్డి, గోపాలకృష్ణ, వెంకటేశ్వర్లు, సుమన్, సత్యనారాయణ, సాయిబాబా పాల్గొన్నారు.