దుబ్బాక, అక్టోబర్ 3: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను టార్గెట్ చేస్తూ..అధికార కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గురువారం దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొని తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కాన్వయ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో బీఆర్ఎస్ నాయకులు సైతం అక్కడికి చేరుకున్నారు. శివాజీ చౌక్ వద్దకు ఎమ్మెల్యే కాన్వయ్ వస్తుండగా..కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు కొడి గుడ్లు విసిరేందుకు ప్రయత్నించారు. పోలీసుల జోక్యంతో రెండు పార్టీల నేతలు అక్కడి నుంచి వెనుదిరిగారు. అధికార కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శిస్తున్నారని, చిల్లర రాజకీయాలు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
దొంగే ..దొంగ అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నెలకొందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంత్రులే రోడ్డునపడటం హాస్యాస్పదంగా మారిందన్నారు. ఓ మహిళా మంత్రి కంటతడి పెట్టుకోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా మంత్రికే రక్షణ కరువైతే..సామన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మంత్రిపై ట్రోల్ చేసే బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా అంటూ గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా మీరు బాధ్యతను మర్చి ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్పై నిందలువేయడం సరికాదన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తుండటం హాస్యాస్పదంగా మారిందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమవంతుగా పోరాడుతుంటే ..కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.