సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తి పోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో అధికారులు హడలిపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ ప్రమేయం లేకుండా అమలు చేయొద్దని కాంగ్రెస్ నాయకులు ఆదేశాలు జారీ చేస్తుండటంతో తాము అర్హులకు న్యాయం చేయలేకపోతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా “నంగునూరు మండలంలో తానుపని చేయలేను,తనను ఇంకో చోటికి బదిలీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌కు మండల పరిషత్ పర్యవేక్షకుడు అర్జీ పెట్టుకున్నాడు. స్థానికంగా ఉండే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అర్జీలో పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తీసుకుని మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారని, తాను నంగునూరు మండలంలో పనిచేయలేనని, తనను ఇతర మండలానికి బదిలీ చేయాలని విన్నవించారు. ఇది సిద్దిపేట జిల్లాలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి బాధనే కాదు ..వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఇదే. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు అధికార కాంగ్రెస్ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారిక వేదికలపై కూర్చుంటున్నారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో రోజురోజకూ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వం మాది.. మేము చెప్పిన పనులు చేయాల్సిందే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు… అంటూ క్షేత్రస్థాయిలోని అధికారులకు నిత్యం కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆపార్టీలోని వర్గాల మధ్యన అధికారులు నలిగిపోతున్నారు. ఒక వర్గం ఒక పని చేప్తారు… మరో వర్గం వచ్చి అది వద్దు ఇది చేయాలంటూ బెదిరింపులు… ఇలా కాంగ్రెస్ నాయకుల బెదిరింపుల మధ్య తాము పనులు చేయాల్సి వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. పేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు పూర్తిగా అనర్హులకు అందుతున్నాయని ఉద్యోగులే చెబుతున్నారు.
ఇదేంటి అంటే వాళ్లు చెప్పింది చేయకపోతే మమ్ముల్ని బెదిరిస్తున్నారని ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ నాయకల బెదిరింపుల మధ్య తాము ఉద్యోగాలు చేయలేమంటూ సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌కు ఉద్యోగులు లేఖలు రాస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కాంగ్రెస్ నాయకులు తిష్ట వేస్తున్నారు. అక్కడే కూర్చుండి ప్రతి ఫైల్‌ను చూస్తున్నారు. అధికారులు పనులు చేసుకోకుండా అక్కడే ఉండి పైరవీలు చేస్తూ తమకు అనుకూలంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు తయారు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉన్నా వాటిని పక్కనబెట్టి కాంగ్రెస్ నాయకులకు డబ్బులు ఇచ్చిన వారి పేర్లు లేదా… వారికి అనుకూలమైన వారి పేర్లు రాస్తూ జాబితాలు చక్క బెడుతున్నారు. అలా కాదు అని అధికారులు అంటే వారిని బెదిరించి జాబితా తయారు చేస్తున్నారు.
ప్రభుత్వం మాది తాము చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అంటు హుకుం జారీ చేస్తున్నారు.గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని అధికారులకు హుకుం జారీ చేస్తుండంతో ఆయా మండలాల్లో పనిచేస్తున్న అధికారులు హడలిపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో తమ ప్రమేయం లేకుండా చేయవద్దని అధికారులకు గట్టిగా చెబుతున్నారు.దీంతో అర్హులైన వారికి న్యాయం చేయలేకపోతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది.. మేము ఏం చెబితే అదే నడుస్తుంది. మేము అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు పనులు అవుతాయి. ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే పనులు అవుతాయని బెదిరిస్తూ లబ్ధిదారుల వద్ద సిద్దిపేట జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఏదో ఒక రకంగా డబ్బులు తీసుకునుడే పనిగాపెట్టుకున్నారు. ఇటీల ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దండుకుంటున్నారు. ప్రతి దానికి ఒక రేటు ఉంది.
ఆ రేటు ప్రకారం డబ్బులు ముట్ట జెప్పితేనే పనులు అవుతున్నాయని పేద ప్రజలు వాపోతున్నారు.అయా మండల కేంద్రాల్లోని స్థానిక తహసీల్ కార్యాలయాల్లో కాంగ్రెస్ నాయకులు తిష్టవేసి కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుల జాబితాలను గ్రామాల లీడర్లకు చేరవేస్తున్నారు. ఆ జాబితా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుడికి ఫోన్ చేసి మీకు ఈ పథకం మంజూరైంది. తమకు రూ. 5 వేల రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే పనులు అవుతాయి అంటూ బెదిరిస్తున్నారు. ఇలా సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు కొనసాగుతున్నాయి.