సిద్దిపేట, జనవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి గ్రామాల్లో జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ పనితీరుపై గ్రామసభలో నిరసనల హోరు కొనసాగుతున్నది. రెండోరోజూ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్వ తీరును ప్రజలు తీవ్రంగా ఎండగట్టారు. గ్రామసభల్లో ప్రజలు లొల్లిలొల్లి చేశా రు. నిరసనలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. సంక్షేమ పథకాల జాబితాలను ఏ ప్రతిపాదికన సిద్ధ్దం చేశారని ప్రశ్నించారు.
రేషన్ కార్డుల కోసం ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? ఇందిరమ్మ ఇండ్లకు కోసం ప్రజాపాలనలో ఇచ్చిన ధరఖాస్తులు ఏమయ్యాయి.. అంటూ అధికారులను నిలదీశారు. వివిధ సంక్షేమ పథకాల కోసం గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల గ్రామసభలను ప్రజలు బహిష్కరించారు. మరికొన్నిచోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలకేనా సంక్షేమ పథకాలు? ఇదేం ప్రభుత్వం అంటూ గ్రామసభల్లో ప్రజల తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఎన్నికల ముందు చెప్పింది ఏంటి? ఇప్పడు చేస్తున్నది ఏంటి? అంటూ అధికారులను నిలదీశారు. మద్దూరు మండలం నర్సాయపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య గ్రామసభలు తూతూమంత్రంగా నిర్వహించి మమ అనిపించారు.