నర్సాపూర్,ఏప్రిల్ 17: ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలు ఛేదించి ఇండ్లు మంజూరు చేయించానని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రెండేండ్లు తిరిగితే ప్రభుత్వం 400 ఇండ్లు మంజూరు చేసిందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మండలానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నర్సాపూర్‌కు 500 ఇండ్లు మంజూరు చేశారని, సీతారాంపూర్, రుస్తుంపేట గ్రామాల్లో కాలనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇండ్లు మంజూరు చేసిందని, ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా గుడిసె, రేకులు, పెంకుటిండ్లు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం కింద ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం విధించిన కారు, ట్రాక్టర్ నిబంధనలు తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ మండలంలో 174 మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే 50 మందికి మాత్రమే మంజూరు చేశారన్నారు.
ప్రజాసమస్యలపై కొట్లాడటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం నర్సాపూర్‌లో అందుబాటులో ఉంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ డీఈ ప్రభు, ఏఈ చంద్రశేఖర్, ఇన్చార్జి ఎంపీడీవో మహ్మద్ మోజం హుస్సేన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మాజీ ఎంపీటీసీలు సత్యంగౌడ్, మహ్మద్ షరీఫ్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, నాయకులు జితేందర్‌రెడ్డి, రవి, అశోక్, శ్రీశైలం పాల్గొన్నారు.