నర్సాపూర్, ఆగస్టు 26: యూరియా కృత్రిమ కొరతకు ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారే అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో చేసి ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు సంఘీభావంగా వారితో పాటు ధర్నాలో పాల్గొన్నారు.
దాదాపు గంట సేపు ధర్నా కొనసాగడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకొని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను, కొంత మంది రైతులను అరెస్ట్ చేసి నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. తెల్లవారుజాము నుంచి రైతులు పడిగాపులు కాసినా యూరియా దొరకడం లేదన్నారు. యూరి యా కోసం రైతుల పక్షాన ధర్నా చేపడితే అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు యూరి యా కొరత రాకుండా చూశారన్నారు. అప్పట్లో రైతులు ఏనాడూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో యూరియా పుష్కలంగా దొరికేదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో, సరైన ప్రణాళిక లేక యూరి యా కొరత ఏర్పడిందని దుయ్యబట్టారు.
రైతులు అప్పుచేసి నాట్లు వేస్తే, నేడు యూరి యా దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రైతులు కడుపుమంటతో రైతులు సద్దులు కట్టుకొని మరీ ఫర్ట్టిలైజర్ షాప్‌ల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు మూడు లోడ్ల యూరియా కావాలని అడిగినా స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఇంట్లో యూరియా స్టాక్ దొరకడం ఇందుకు నిదర్శనమని అన్నారు.
నర్సాపూర్ మండలంలో ఎలాంటి యూరి యా కొరత లేదని తహసీల్దార్ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం సరైంది కాదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అధికారుల దృష్టి ఆకర్షించుకోడానికి వాళ్ల మీద నెపం వేయకుండా ఉండడానికి రైతులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని.. అధికారులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. నిరంతరం రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, సుదీప్, చింతస్వామి, ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.