సిద్దిపేట, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల తీరు నచ్చక ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ఇన్నాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆనేతలకు ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయి. జిల్లాలోని ముఖ్యనేతల తీరుపై సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. గ్రూపుల గోలతో విసిగి పోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమకు భవిష్యత్ లేదనుకున్న నేతలు ఆపార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెల రోజల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ లోగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కొంత మంది నేతలు ఆపార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా అధికార పార్టీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హన్మంతరావుల ఒంటెద్దు పోకడలకు నిరసనగా సోమవారం మెదక్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఇలా ఒక్కో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నాం అంతా మాదే అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన నేతల ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో ఏం తోచక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరిపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు 3 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి పెరిగిపోతున్నది. సొంత పార్టీ ముఖ్యనేతల తీరుతో క్షేత్ర స్థాయి క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
ఇటీవల బీఆర్ఎస్లో చేరికలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు మంత్రి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల రాయికోడ్ మండలం నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్ట్టీకి రాజీనామా చేసి ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నేతృత్వంలో సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇలా అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి, ఝరాసంగం తదితర మండలాల నుంచి కాంగ్రెస్, బీజేపీ లకు రాజీనామాలు చేసి స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తాజాగా మెదక్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒంటెద్దు పోకడలకు నిరసనగా పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. సోమవారం గంగా నరేందర్, న్యాయవాది జీవన్‌రావు, రంగారావు, అజ్మీరాస్వామి, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇదంతా తండ్రీ కొడుకుల ఒంటెద్దు పోకడలు నచ్చక వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ప్రతి మండలంలోనూ ముఖ్య నాయకులు తమదారి తాము చూసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీరుపై సొంత క్యాడర్ భగ్గుమంటుంది. హన్మంతరావు, ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తీరు వల్ల కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి దాదాపు 19 నెలలు గడుస్తున్నా క్యాడర్‌కు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఎన్నికల ముందు క్యాడర్‌కు చెప్పిన విధంగా నడుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్నున్నారు. ఏదైనా పనికి వెళ్తే ఛీదరించకుంటున్నారని సొంత క్యాడర్ మాట్లాడుకుంటున్నారు.
పైగా నా తీరు ఇంతే… అన్ని నాకు తెలుసు.. మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఉంటే ఉండండి.. పార్టీలో పోతే పోండి అని ఛీత్కారంగా మాట్లాడుతున్నారని కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పదవుల ఆశచూపి ఒక్కరికి కూడా ఒక్క పదవి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఎన్ని రోజులు ఉన్నా మా రాజకీయ భవిష్యత్ ఇంతే అని మైనంపల్లిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. మైనంపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గంలో సొంత క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఆతర్వాత ఏ ఒక్కటి పట్టించుకోవడం లేదనే విమర్శలు నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. నియోజకవర్గంలో చేసిన పనికూడా ఒక్కటి లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం సొంత క్యాడర్‌కు మర్యాద కూడా ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తండ్రీ కొడుకులకు గట్టి గుణపాఠం తప్పదని సొంత క్యాడరే బహిరంగంగా చెబుతున్నారు.
దీంతో మైనంపల్లిపై ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతుంది. మైనంపల్లి తీరు వల్ల గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్ తదితర నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లో గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో మైనంపల్లికి ఇక్కడ ఏంపని .. అంటూ ప్రెస్మీట్లు పెట్టి సొంత క్యాడర్ విమర్శలకు దిగింది. మీ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం అంటు విమర్శలు చేశారు. ఇలా ఎక్కడికి వెళ్లినా మైనంపల్లి హన్మంతరావుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సిద్దిపేటలో మైనంపల్లి తీరుతో మూడు గ్రూపులయ్యాయి. ఇతర ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మైనంపల్లి సొంత క్యాడర్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.