గజ్వేల్, జూలై 16: సిద్దిపేట జిల్లాలో వ్యవసాయానికి సరిపడా త్రీఫేజ్ కరెంట్ సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ వానకాలం 3.50లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. భారీ వర్షాలు పడితే పొలాలను తడుపుకొని రైతులు వరినాట్లు వేయనున్నారు. ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంపై పడింది. భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయేనని రైతులు ఎదురుచూస్తున్నారు. నారుమడులను రక్షించుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కూడవెల్ల్లి, హల్దీవాగులు నింపడం, కాల్వల ద్వారా సాగునీళ్లు అందుతుండడంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. అదే ఈసారి రైతులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో కోతలు, సాగునీరు సరఫరా కాక పంటల సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయానికి 14గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అధికారులు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వర్షాల కోసం ఓవైపు రైతులు ఎదురుచూస్తుంటే, కరెంట్ సరఫరాలో కోతలు అన్నదాతలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. గజ్వేల్ మండలంలో రెండు రోజులుగా త్రీఫేజ్ కరెంట్ ఉదయం సమయంలో రావడం లేదు. దీంతో గురువారం ధర్మారెడ్డిపల్లి గ్రామ రైతులు సమీపంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు.
రెండు రోజులుగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4 వరకే త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తుండడంతో పొలాలు తడవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల కరెంట్ సరిపోవడం లేదని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా నిరంతర త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొండపాక మండలంలోనూ కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. రైతులు వ్యవసాయానికి 18గంటల కరెంట్ సరఫరా చేయాలని కోరుతూ గురువారం మిరుదొడ్డి మండలంలోని ఖాజీపూర్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే సమస్య ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగుకు కోతలు లేకుండా త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా కరెంట్ సరఫరా చేయాలి. రెండు రోజులుగా ఉదయం త్రీఫేజ్ కరెంట్ రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడితే సరైన సమాధానం చెప్పడం లేదు. నాట్లు వేసుకునే సమయంలో కోతలు విధిస్తే రైతులకు తీరని నష్టం జరుగుతుంది. వర్షాలు లేక రైతులు వేసిన మొక్కజొన్న, పత్తి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. వరిసాగు చేద్దామంటే కరెంట్ ఇవ్వడం లేదు. అధికారులు త్రీఫేజ్ కరెంట్‌ను సక్రమంగా సరఫరా చేయాలి.
– జెజాల వెంకటేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్, గజ్వేల్ (సిద్దిపేట జిల్లా)
కేసీఆర్ ప్రభుత్వం ఉండగా 24గంటల కరెంట్ ఇచ్చిండు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరా చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలైతది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. మూడు ఎకరాలు దున్నితే ఇప్పుడు ఎకరం పారుతుంది. రైతుల పరిస్థితి ఏమీ బాగాలేదు.
– రాములు, రవీంద్రనగర్, కొండపాక (సిద్దిపేట జిల్లా)