సిద్దిపేట,సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యూరియా…యూరియా… యూరియా.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి వినిపిస్తున్న మాట. నిత్యం యూరియా కోసం చంటిపిల్లల తల్లుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడుతున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా చేయడం లేదు. జిల్లా వ్యవసాయాధికారులను యూరియా ఎంత పంపిణీ చేశారు.. డిమాండ్ ఎంత ఉంది..? అనే లెక్కలు అడిగితే ..తర్వాత చెబుతాం అంటూ దాటవేస్తున్నారు.
రైతులకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. ఒక వైపు ప్రకృ తి అల్లకల్లోలం చేస్తే మరో వైపుకాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలను తెచ్చిపెట్టింది. పంటలు పండక, చేసిన అప్పలు తీర్చే మార్గం లేక రైతులు కుంగిపోతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు క్యూలో నిల్చున్నా యూరియా దొరకక రైతు వేదికలోని ఫర్నిచర్‌ను రైతులు ధ్వంసం చేశారు. నంగునూరు మండలం పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఉదయం నుంచి గంటల కొద్దీ క్యూలో నిల్చున్నారు.రాయపోల్‌లో భారీగా రైతులు ఉన్నారు.
వ్యవసాయ పనులు పక్కన పెట్టి యూరియా కోసం రోడ్ల మీదికి రైతులు వచ్చారు.ధూళిమిట్టలో యూరియా కోసం రైతులు భారీగా క్యూలో నిల్చున్నారు. దౌల్తాబాద్ చౌరస్తాలో రైతు వినూత్నంగా నిరసన తెలియజేశాడు. గజ్వేల్‌లో మంగళవారం క్యూలో నిల్చున్న ఇద్దరు మహిళల మధ్య మాటామాట పెరిగి చెప్పులతో కొట్టుకున్నారు. యూరియా కోసం పెద్ద ఎత్తున మహిళలు గజ్వేల్ మార్కెట్ యార్డుకు వచ్చారు. బాలింతలు సైతం వచ్చి క్యూలో నిలబడ్డారు. మర్కూక్‌లో రోడ్డుపైనే పాస్‌పుస్తకాలు, కాగితాలను వరుసలో పెట్టారు.మెదక్ జిల్లా శివ్వంపేట సహకార సంఘం ఎదుట రైతులు బారులు తీరారు. రాత్రి పూట అక్కడే భోజనాలు చేశారు. వరుసలో ఇటుకలు, రాళ్లు, తువ్వాళ క్యూలో పెట్టారు. చినశంకరంపేట మండలంలోని మడూరు సొసైటీ ఎదుట రైతులు బారులు తీరారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలో యూరియా కోసం క్యూలో భారీగా రైతులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరిపడా అందించక పోవడంతో క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యవసాయాధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఓ వైపు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు… మరో వైపు యూరియా కొరత వ్యవసాయాధికారుల మీద పెనుభారం పడుతున్నది. రైతులకు ఏం సమాధానం చెప్పా లో తెలియక వారు సతమతమవుతున్నారు. యూరియా ఒత్తిడిని తట్టుకోలేక సిద్దిపేట జిల్లా దుబ్బాక ఏవో ప్రవీణ్‌కు గుండెపోటు వచ్చింది.
ఆయన్ను కుటుంబ సభ్యులు చికిత్సకోసం హుటాహుటిన సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు.ప్రస్తుతం అతను దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయశాఖలోని ఏవోలు, ఏఈవోలు యూరియా ఒత్తిడి తట్టుకోలేక దవాఖానలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు సమాచారం.వారం రోజుల కింద దుబ్బాక నియోజకవర్గంలోని ఓ వ్యవసాయాధికారిని అధికార పార్టీ నాయకులు బెదిరించడంతో పాటు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు.
దీంతో స్వయంగా ఆ ఉన్నతాధికారి అక్కడికి వెళ్లి సంబంధిత అధికారిని గట్టిగా మందలించాడు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాలి అని చెప్పాడు. దీంతో ఆ అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించడం కష్టంగా మారిందని పలువరు అధికారులు వాపోతున్నారు. జిల్లాలోని పలువురు ఏవోలు, కింది స్థాయి ఏఈవోలు ఒత్తిడికిలోనై దవాఖానలపాలు కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల నుంచి యూరి యా కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. యూరియా కోసం పనులు పక్కన పెట్టి..రాత్రీ పగలు అనే తేడా లేకుండా ఫర్టిలైజర్ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.వర్షాలకు తడుస్తూనే క్యూలోనే రైతులు నిల్చుంటున్నారు. ఇంత నిల్చున్నా యూరియా దొరుకుతదన్న గ్యారె ంటీ లేదని రైతులు వాపోతున్నారు. సాగు చేసిన పంటలకు సకాలంలో యూరియా వేయక ఎర్రబారిపోతున్నాయి.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం యూరియా మీద జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, జిల్లా మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించ లేదు. యూరియా దొరకక రైతులు కొట్టుకుంటున్నారు. ఇది మంత్రులకు కనిపించడం లేదా ?ఎందుకు మౌనం? రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మంత్రులకు లేదా? అని ఉమ్మడి జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు.
పందేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. రైతుల ముంగిటనే వారికి అన్ని సేవలు అందించారు. సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేశారు. పదేండ్లలో కర్షకులు సంతోషంగా సాగు పనులు చేసుకున్నారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఏనాడు కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి లేదు ఇవ్వాళ కాంగ్రెస్హయాంలో రైతులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.
20 రోజుల నుంచి వస్తే యూ రియా బస్తా దొరకడం లేదు. కాం గ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలు మొదలయ్యాయి. ప్రభు త్వం సరిపడా యూరియా ఇవ్వ డం లేదు. కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండే.. సరిపడా సరఫరా చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూరియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
-లక్ష్మారెడ్డి, రైతు, గ్రామం లక్ష్మీనగర్, మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా
నేను చిన్నప్పటి నుంచి యూరియా కోసం గింత తిప్ప లు ఎన్నడూ పడలే. యూరి యా కావాలని దినమంతా క్యూలో ఉన్నా ఒక బస్తా కూడా దొరుకుతలేదు. యూరియా కో సం ఆఫీసుల చుట్టూ రోజు తిరుగుడైతంది. ఇక్కడ టోకెన్లు ఇస్తమంటరు, అక్కడ బస్తాలు ఇస్తమంటరు. ప్రభుత్వం రైతులను పిచ్చొళ్లను చేస్తుంది. సమయానికి యూరియా లేక పంటలు నష్టపోవాల్సి వస్తుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యూరియా ఇండ్ల వద్దకే వచ్చేది. రైతులకు ఏకష్టం లేకుండా అన్ని పనులు మంచిగ జరిగేవి. గిప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు కావాల్సిన యూరియా బస్తాలు ఇవ్వా లి లేకపోతే తీవ్రంగా నష్టపోతాం.
-బర్మ రాజమల్లయ్య, మాజీ సర్పంచ్, బైరాన్‌పల్లి, ధూళిమిట్ట మండలం, సిద్దిపేట జిల్లా
గురువన్నపేట పీఏసీఎస్ సొసైటీ ద్వారా ఐనాపూర్‌కు యూరియా వస్తుందని తెలిసి వచ్చా. మూడు రోజుల నుంచి ఇక్కడ టోకెన్లు ఇస్తున్నరట. బుధవారం వచ్చా టోకెన్ ఇవ్వలేదు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామానికే యూరియా వచ్చేది. అవసరం ఉన్న వాళ్లు తీసుకున్న తర్వాత మిగిలిన యూరియా వాపస్ పోయేది. మళ్లీ అవసరం ఉంటే ఆటోవాళ్లకు చెబితే ఎరువుల దుకాణంలో తెచ్చేవాళ్లు. కానీ కాంగ్రెస్ పాలనలో యూరియా కావాలంటే పని వదిలిపెట్టి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. తీరా పడిగాపులు కాసినా సరిపడా యూరియా ఇవ్వడం లే దు. యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందనుకోలేదు.
-తేలు కనకయ్య, రైతు, గురువన్నపేట, కొమురవెల్లి మండలం , సిద్దిపేట జిల్లా