Siddipeta | చేర్యాల, మార్చి 7 : సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు నిత్యం ఉపయోగపడే గోడౌన్ శిథిలావస్ధకు చేరుకుంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామమైన మండలంలోని కడవేర్గు గ్రామంలో గత మూడు దశాబ్ధాలుగా రైతుల పంటలకు ఎరువులను అందించిన గోదాం నేడు శిథిలమైపోయింది. నిర్లక్ష్యం నీడలో గోడౌన్ ఉండిపోవడంతో రైతులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందే రాయితీ ఎరువుల బస్తాలు గోడౌన్‌కు రాకపోవడంతో రైతులు మండల కేంద్రానికి వచ్చి ఎరువులు తీసుకుపోతుండంతో వారికి భారంగా మారింది.
గ్రామంలో ఉన్న నాయకులు గోడౌన్ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. నాయకులు పదవులపై ఆరాటం తప్ప గ్రామాభివృద్ధి గురించి ఆలోచించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే గోడౌన్‌కు మరమ్మత్తులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామ యువత కోరుతున్నారు.