పూలమ్మిన చోట కట్టెలమ్మిన పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని హంగులతో కళకళలాడిన పల్లెలు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలయ్యాయి. ప్రభుత్వం మారిన మరుక్షణమే అదేం విచిత్రమో గాని గ్రామాలకు దిష్టి తగిలినట్లు, ఏదో అరిష్టం పట్టుకున్నట్లు కళతప్పి కునారిల్లుతున్నాయి. నాడు వైభవంతో వెల్లివిరిసిన గ్రామాలు, నేడు పరాధీనతతో చిన్నబోయిన అనుభూతి కలుగుతున్నది.
నిర్వహణ కొరవడి కొంత, నిధులు లేక మరికొంత జవాబుదారీ లేని పాలన వెరసి ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమయ్యే దుస్థితి దాపురించింది. గ్రామాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాగ్రెస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇట్టే అర్థమవుతుంది.
నారాయణఖేడ్, డిసెంబర్ 8: గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పెద్దఎత్తున నిధులు మంజూరు చేసి, ఆయా పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఎస్డీఎఫ్, ఎన్ఆర్ ఈజీఎస్ వంటి ప్రత్యేక నిధులతో పాటు పంచాయతీ నిధులు వెచ్చించి సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు పూర్తి చేసింది. గ్రామా లు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసి ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంప్‌యార్డుకు తరలించడం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య సమస్య లేకుండా సీఎం కేసీఆర్ చేశారు. గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలనే సంకల్పంతో విరివిగా మొక్కలు పెంచారు. అందుకు అవసరమైన నర్సరీలను సైతం గ్రామాల్లోనే ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణం కోసం పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయగా, ప్రజల సౌకర్యం కోసం ప్రతి గ్రామంలో శ్మశానవాటిక నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీటి సరఫరా, ‘మనఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనాల ఆధునీకరణ వంటి పనులు కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలపై చూపిన చిత్తశుద్ధికి నిదర్శనం.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి గాలిలో దీపం మాదిరిగా మారింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే సర్పంచ్ల పదవీ కాలం పూర్తి అయ్యింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే గ్రామాలు కొనసాగుతున్నాయి. ఓవైపు పంచాయతీలకు నిధుల లేమి, మరోవైపు నిర్వహణ లోపం కలగలిసి గ్రామాలను పట్టించుకునే దిక్కు కరువైన పరిస్థితి. అత్యవసర పనుల కోసం అధికారులు తమ సొంత డబ్బులు వెచ్చించాల్సిన అనివార్యత అందరికీ తెలిసిందే. చెత్త తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ నిర్వహణ కూడా చేపట్టలేని పరిస్థితుల్లో జీపీలు చేరాయి. దీంతో ట్రాక్టర్లు మూలకు చేరగా, డంప్యార్డులన్నీ వినియోగంలో లేకుండా పోయాయి.
ఈ నేపథ్యంలోనే ఇక ట్రాక్టర్లను వినియోగించలేమని గ్రామ పంచాయతీ సిబ్బంది మూకుమ్మడిగా ట్రాక్టర్ల తాళాలను అధికారులకు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. నర్సరీల నిర్వహణ గగనమైన పరిస్థితి ఉండగా, ఇక మొక్కల పెంపకం పడకేసింది. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ లేక ఎండిపోతున్న చెట్లు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. మిషన్ భగీరథ నీరు రెండు, మూడు రోజులకు ఓ దఫా సరఫరా కావడం సర్వసాధారణంగా మారింది. పల్లె ప్రగతి, మన ఊరు-మనబడి కార్యక్రమాలు కనుమరుగయ్యాయి. పంచాయతీ నిధులకే దిక్కు లేని పరిస్థితుల్లో ఇక ప్రత్యేక నిధుల మాట దేవుడెరుగు. మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం గ్రామాల విషయంలో గత పరిస్థితిని పూర్తిగా తలకిందులు చేసి మాట నిలబెట్టుకుందని చెప్పకతప్పదు. ప్రస్తుత అధ్వాన పరిస్థితులను కళ్లారా చూస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును గుర్తుకు తెచ్చుకుని మదన పడడం పల్లె ప్రజల వంతైంది. రెండేండ్లలో ముందుకు సాగని గ్రామాల ప్రగతి రథం వచ్చే మూడేండ్లలో ఏ మేరకు ముందడుగేస్తుందో వేచి చూడాలి మరి.