మెదక్, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, పాలన మరిచి కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి బీజేపీ నాయకులు పలువురు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ నర్సాపూర్ పట్టణ మహేందర్‌గౌడ్‌తో పాటు అతని అనుచరులు వంద మంది వరకు బీఆర్ఎస్లో చేరడంతో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో పురోగమించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.200 పింఛన్‌ను రూ. 2వేలు చేసిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేసిందన్నారు. వ్యవసాయానికి 13 గంటలు మించి కరెంట్ సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నర్సాపూర్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను మంజూరు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పనులు నిలిపివేసిందన్నారు. రైతులకు రైతుభరోసా సకాలంలో ఇవ్వడం లేదని, రైతులు పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతురని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు డబ్బులు వేసేవారని, కాంగ్రెస్ ఓట్లు ఉంటేనే రైతుభరోసా వేస్తుందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.