తొగుట, అక్టోబరు 15 : బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వంటి పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువల నిర్మాణం చేపట్టడం లేదని, కాలువల్లో పూడిక తీయించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధరలేక రైతులు దళారుల పాలవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదన్నారు. రేపటిలోగా మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
సన్నధాన్యానికి ఇంత వరకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులను ఢోకా చేయడమే అవుతుందన్నారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని ఎమ్మెల్యే విమర్శించారు. తెలంగాణ రాక ముందు కరువు మండలాల జాబితాలో తొగుట, రాయపోల్, దౌల్తాబాద్ ఉండేవని, కేసీఆర్ పాలనలో గోదావరి జలాలు పారించిన తర్వాత కరువు మాయమైందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా ఉప కాలువలు లేక దుబ్బాక నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సాగునీరు వినియోగించుకోలేక పోతున్నామని తెలిపారు. కాలువల నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. భారీనీటిపారుదల శాఖ మంత్రి, ఇన్చార్జి మంత్రులు ఇప్పటికైనా స్పందించి ఉప కాలువలు పూర్తి చేయించాలని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కోరారు.
కార్యక్రమంలో తహసీల్దార్ మహ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్, మార్కెట్ కార్యదర్శి స్వామి, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లు కె.హరికృష్ణారెడ్డి, కుర్మ యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, ఐకేపీ ఏపీఎం బాబురావు, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, సిరినేని గోవర్ధన్‌రెడ్డి, వెల్పుల స్వామి, బక్క కనకయ్య, సుతారి రమేశ్, కంది రాంరెడ్డి, బోదనం కనకయ్య, శ్రీశైలం, నర్సెట్టి మల్లేశం, మధుసుదన్‌రెడ్డి, రాజిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, మాదాసు అరుణ్‌కుమార్, గొడుగు ఐలయ్య, నరేందర్‌గౌడ్, బాలరాజు, తగరం అశోక్, అంజయ్య, మంగ యాదగిరి, మహేశ్, శ్రీనివాస్ గౌడ్, బండారు స్వామిగౌడ్, రమేశ్‌గౌడ్, సంతోష్, జహంగీర్, రాంబాబుతో పాటు ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అకాల మరణం పొందిన మండలంలోని వెంకట్రావుపేట గ్రామ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు సిరిసిల్ల్ల రాజేశం కుటుంబానికి అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వెంకట్రావుపేటలో ఆయన కుటుంబీకులను ఎమ్మెల్యే పరామర్శించారు.