సిద్దిపేట, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మెదక్, (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్నారు. పొలాలు దుకులు దున్నేందుకు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. రోహిణి కార్తెలో పడే వర్షాలతో దుక్కులు సిద్ధం చేసి, ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే విత్తనాలు వేయాల్సిన సమయం. ఇంతవరకు యాసంగి ధాన్యం కాంటా కాక 40 రోజులకు పైగా కేంద్రాల్లోనే రైతులు నిరీక్షిస్తున్నారు. ధాన్యం తూకం వేసినా డబ్బులు రావడానికి మరో నిరీక్షణ తప్పడం లేదు. ఈ పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉంది.
ప్రస్తుతం జిల్లాలోని రైతులు ఎదురొంటున్న ప్రధాన సమస్య. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండడంతో వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటున్నది. తరుగు, తేమ, రంగు మార్పు పేరుతో కోతలు విధిస్తున్నారు. చివరకు రైతుకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతున్నది. పంట అమ్మినా రైతు అప్పుల పాలవుతున్నాడు. వానకాలం ప్రారంభానికి ముందు రైతులకు రైతు భరోసా నిధులు అందితే కొంత ఉపశమనం లభించేంది. అది ఇప్పటికీ అతీగతిలేదు.
చాలామంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడంతో ప్రైవేట్ అప్పుల వైపు పరుగులు పెడుతున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద 5 శాతం వరకు వడ్డీకి డబ్బులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడింది. పంట మొదలు కాకముందే రైతు అప్పుల ఊబిలోకి జారిపోతున్నాడు. పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక ఎకరం సాగు చేయాలంటే వేలాది రూపాయలు అవసరం. దుకి, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు అన్నీ రోజురోజకు పెరిగిపోతున్నాయి. డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్‌తో దుక్కి దున్నడానికి ఖర్చులు పెరగనున్నాయి.
వానకాలం పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు రైతులు పరుగులు తీస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏటా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు పంట పెట్టుబడి కోసం రైతుబంధు డబ్బులు ఎకరానికి రూ.5 వేలు ముందుగానే వేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా డబ్బులు సకాలంలో వేయడం లేదు. దీంతో పాటు బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట పెట్టుబడి అప్పులు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు.
ధాన్యం అమ్మినా రైతులకు సకాలంలో డబ్బులు రాకపోవడంతో పంట పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ సర్కారు యాసంగికి సంబంధించి రైతుభరోసా డబ్బులు పూర్తిస్థాయిలో వేయలేదు. వానకాలంలో కోసం పూర్తిస్థాయిలో రైతుభరోసా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ఎకరం భూమి దున్నేందుకు రూ. 3వేల వరకు ఖర్చు అవుతున్నది. విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు సన్న, చిన్నకారు రైతుల వద్ద డబ్బులు లేకపోవడంతో వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటున్నారు.
మెదక్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది వరి, పత్తి, మొక్కజొన్న సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2025 వానకాలంలో 3,15, 675 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2026లో వాన కాలంలో 3,16, 690 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. పత్తి 3,55,83 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 36వేల ఎకరాలు, మొక్కజొన్న 2626 సాగు చేయగా, ఈ ఏడాది 3 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచన వేశారు. కందులు 1835 ఎకరాలు సాగు చేయడా, ఈ ఏడాది 1850 ఎకరాలు, పెసర 945 ఎకరాలు, ఈ ఏడాది 1250 ఎకరాలు, మినుములు 670 ఎకరాలు, ఈ ఏడాది 700 ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందన్నారు.
జొన్న 38 ఎకరాలు, ఈ ఏడాది 40 ఎకరాలు, సోమబీన్ 112 ఎకరాలు, ఈ ఏడాది 125 ఎకరాలు, చెరుకు 70 ఎకరాలు ఉండగా, 75 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అంచనా వేశారు. కూరగాయలు 699 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది 708 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్ 1202 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది 1650 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. వానకాలంలో 3,67, 668 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా, రైతుల సంక్షేమానికి చేసిందేమీ లేదు. ఇప్పటివరకు 75 రోజుల దాటినా రైతుభరోసా పత్తాలేదని రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మార్చి 22న ప్రారంభించి, అదే వేదిక నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు అందించాల్సిన ఉచిత విద్యుత్, పంట చివరి గింజ వరకూ కొనుగోలు చేయడమే కాకుండా, బోనస్ ఇచ్చి రైతుల కళ్లల్లో ఆనందం నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గొప్పగా చెప్పారు. ఇదే వేదిక నుంచి దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేస్తానని, రేపటి నుంచి అవి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని చెప్పారు. మరో రూ.2,700 కోట్లు, ఆ తర్వాత 20 రోజుల్లో రూ.2,700 దాదాపుగా 45 రోజుల్లో రూ.9,000 కోట్లు 70 లక్షల ఖాతాల్లో వేస్తామని సీఎం గొప్పగా సెలవిచ్చారు. కానీ, ఇంతవరకు పూర్తి స్థాయి రైతు భరోసా ఏ ఒక్క రైతుకు వేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. రైతుల గోస పట్టించుకోవడం లేదు. పాత పంట బాకాయిలు అలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొత్త పంట పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తున్నది. రైతన్న ముఖంలో ఆనందం కనిపించడం లేదు. కొత్త పంట ఆశల కంటే పాత పంట కష్టాలే ఎకువగా వెంటాడుతున్నాయి. యాసంగిలో పండించిన ధాన్యం అమ్మినా డబ్బులు ఇంకా చేతికి రాలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుభరోసా నిధులు ఇంకా అందలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే సమయం దగ్గర పడడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉప్పుకు పుట్నాలకు వేసినట్లు నెలకు ఒక్కసారి ఎకరం చొప్పున రెండు ఎకరాల వరకు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ఆశగా రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించింది.
వానకాలం ప్రారంభమైంది. కాంగ్రెస్ సర్కారు రైతులకు భరోసా డబ్బులు బ్యాం కు ఖాతాలో జమ చేయలేదు. యాసంగిలో రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో వేయలేదు. మా వడ్లు కూడా కొనడం లేదు. విత్తనాలు, ఎరువులు ఎలా కొనా లి. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే నయముండే. విత్తనాలు, ఎరువులు కొనుగో లు చేసేందుకు సమయానికి రైతుబంధు డబ్బులు వేసేవారు. దీంతో అప్పులు చేయకుండానే పంటలు సాగు చేసుకున్నాం.
– దోకి మధు, రైతు, అంబాజీపేట, చిన్నశంకరంపేట మండలం (మెదక్ జిల్లా)
కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఏటా సీజన్‌కు ముందుగానే మాకు ఠంఛన్‌గా రైతు బంధు డబ్బులు బ్యాం కు ఖాతాలో ఏసిండు. కాంగ్రెస్ సర్కారు వడ్ల కూడా సక్కడ కొనుగోలు చేయడం లేదు. రైతులు పంటలు పండించేందుకు రైతు భరోసా డబ్బులు వేయడం లేదు. ఇప్పటి వరకు వడ్లు కొనుగోలు చేయలేదు. వడ్లు అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు పడడం లేదు. అప్పులు చేసి విత్తనాలు. ఎరువులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది.
– ధ్యాప నర్సింహులు, రైతు, అంబాజీపేట, చిన్నశంకరంపేట మండలం, (మెదక్ జిల్లా)