అమరచింత, ఆగస్టు 9 : బీఆర్ఎస్ నేత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరికలకు సర్కార్ దిగివచ్చింది. వెంటనే జూరాల ఎడమ కాలువకు నీటిని విడుదల చేసింది. కృష్ణా నదికి భారీగా వరద వస్తున్నా.. ప్రవాహం ఉన్నంత వరకే సాగునీటి విడుదల ఉంటుందని అధికారులు ప్రకటన చేస్తూ శనివారం అర్ధరాత్రి నుంచి జూరాల ఎడమ కాలువకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలు కాగా.. వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి జూరాల ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే ప్రాజెక్టుపై ధర్నాకు సిద్ధమవుతున్నట్టు ప్రకటన చేశారు.
దీంతో గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చింది. ఇరిగేషన్ అధికారులు మోటర్ల వద్ద ఉండే లష్కర్లతో ఆదివారం సాయంత్రం సాగునీటిని విడుదల చేయించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం ఉండటంతో ఆంధ్రా నేతలదే పెత్తనం సాగుతున్నదని ఆరోపించారు. జూరాల ఎడమ కాలువకు ఎప్పుడుపడితే అప్పుడు సాగునీటి విడుదల నిలిపివేస్తామంటే ఊరుకునేది లేదని అన్నారు. ఆయకట్టు రైతులకు వానకాలం పంట చివరివరకు సాగునీటిని విడుదల చేయాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.