నారాయణఖేడ్, ఏప్రిల్ 19: ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగానే నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. కేసీఆర్‌పై కక్షతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. సంబంధం లేని కారణాలు చూపుతూ నీటి సరఫరా నిలిపివేస్తున్నారని మండిపడ్డారు.
సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా అడుగంటిన పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 9 టీఎంసీల జలాలు ఉన్నప్పటికి నీటిమట్టం తగ్గిందనే సాకుతో మిషన్ భగీరథ నీటిని నిలిపివేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై, తనపై కక్ష సాధించే ఉద్దేశంతో ప్రజలకు ఇబ్బందులు కల్గించడం సరికాదన్నారు.
నాగల్గిద్ద, కంగ్టి, సిర్గాపూర్ మండలాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రస్తుత వేసవిలో నీటి సరఫరా నిలిపివేస్తే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీవులానాయక్ తండావాసులు నీటి కోసం రోడ్డుపై ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. నీటి సరఫరా విషయంలో ప్రజలకు ఎలా ంటి ఇబ్బంది కలిగినా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.