ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం అస్తవ్యస్తంగా మారింది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓవైపు సర్కారు జాప్యం, మరోవైపు అకాల వర్షాలతో నిండా మునగాల్సిన దుస్థితి ఏర్పడింది. అష్టకష్టాలు పడి కొనుగోలు కేంద్రాలకు వడ్లను తెస్తే అక్కడ అనేక కొర్రీలు పెట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సిద్దిపేట, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం పండించిన రైతులు అడుగడుగునా నిలువు దోపిడీకి గురవుతున్నారు.కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ పేరిట దోపిడీ చేస్తున్నారు. దీంతో పాటు తూకంలోనే వ్యత్యాసాలు ఉంటున్నాయి. తూకం వేసేటప్పుడు ఇష్టారీతిగా వేస్తూ అధిక మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో ధాన్యం కింద పారబోస్తున్నారు. దీంతో రైతులకు భారీగా నష్టం జరుగుతుంది. హమాలీ, ఇతర ఖర్చులు అధికంగానే ఉంటున్నాయి. రైతుల పేర్లు నమోదు చేసుకునే సమయంలో కొత్త గన్నీ బ్యాగులు ఇస్తామని చెబుతున్నా తీరా గన్నీ బ్యాగులు ఇచ్చే సమయంలో కొత్తవి ఇంకా రాలేదు పాతవి ఉన్నవి తీసుకెళ్లండి అంటూ నిర్వాహకులు రైతులకు అంట గడుతున్నారు.
ఈ గన్నీ బ్యాగులు నింపిన తర్వాత బస్తాలు తూకం వేసే సమయంలో కుట్టు కుట్టేటప్పుడు బస్తాల నుంచి కిలోల కొద్ది ధాన్యం కిందపోతుంది. అలా పోయిన ధాన్యం అంతా కుప్పచేసుకొని మళ్లీ వేరే బస్తాల్లో నింపి విక్రయించి నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.చినిగిన గన్నీ బ్యాగులతో రైతులు చాలాఇబ్బందులు పడుతున్నారు. చిరిగిన చోట వరిగడ్డి, కుట్లు వేస్తున్నారు.అయినా బస్తాల నుంచి ధాన్యం ఆగడం లేదు.ఇలా కాంటా అయిన తర్వాత ధాన్యం మిల్లర్ల వద్దకు వెళ్లిన తర్వాత మీ ధాన్యం తరుగు వచ్చింది అని రైతులకు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ తరుగు అంతా నిర్వాహకులే సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులు తీసుకువచ్చిన ధాన్యం మీద అనేక కొర్రీలు పెట్టి ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్రాల్లో దోపిడీ అడ్డూఅదుపు లేకుండా పోతుంది. తేమ శాతం సరిగ్గా ఉన్నా తాలుపేరిట ఇష్టారీతిగా కోతలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఒక్కో బస్తా నుంచి ఎంతలేదన్నా రెండు కిలోల వరకు కట్ చేస్తున్నారు. దళారులు బయట కొన్న ధాన్యాన్ని వారికి తెలిసిన రైతుల పేరు మీద రాయించి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. దళారులు, నిర్వాహకులకు మధ్య ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ధాన్యం అమ్ముకుంటున్నారు.ఒక్కో రైతు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా వారివి కాంటా కాదు అదే దళారులు తీసుకువచ్చిన ధాన్యం త్వరగా కాంటా అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో 5.03 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు కేవలం 52 వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మెదక్ జిల్లాలో 3.20 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం, సంగారెడ్డి జిల్లాలో 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కాగా, ఇప్పటి వరకు 30 శాతం మేర ధాన్యం కొనుగోలు చేయలేదు. నెల రోజులు గడుస్తున్నా కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. యాసంగి సాగు పనులు ప్రారంభం కానున్నా ఇంత వరకు ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగక పోవడంతో కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు.
బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు రైస్‌మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారని చెప్పాలి. ధాన్యం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడం లేదు. దీంతో బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన వాటికే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం అలాట్మెంట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అలాట్మెంట్ కాకపోవడంతో ధాన్యం కొనుగోలు నత్తనడకన కొనసాగుతుంది. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరగడం లేదు.
సిద్దిపేట జిల్లాలో 130, మెదక్ జిల్లాలో 90, సంగారెడ్డి జిల్లాలో 65 మిల్లలు ఉన్నాయి. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 58, మెదక్ జిల్లాలో 45, సంగారెడ్డి జిల్లాలో 33 మిల్లులు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 285 మిల్లులకు 136 మిల్లుల యజమానులు మాత్రమే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు. ఇంకా 149 పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే సగం మిల్లులు కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదు.