దుబ్బాక, జూన్ 6: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విద్యాశాఖకు మంత్రి లేక సర్కారు విద్య బలహీనమవుతున్నది, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విద్యాసంవత్సరం పునఃప్రారంభమవుతున్న ఈ తరుణంలో విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకునే వారు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కారు విద్య గాడితప్పిందన్నారు.
శుక్రవారం దుబ్బాక పట్టణంలో రజనీకాంత్‌రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్తో కలిసి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మందుబాబుల మంచి చెడ్డలు చూసుకునేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడు కానీ, విద్యార్థుల సంక్షేమం చూసే విద్యాశాఖకు మంత్రి లేడని ఎద్దేవా చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఫుల్ యాక్టీవ్‌గా ఉన్నాడని, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి మద్యం ధరలు పెంచుతూ మంత్రి చాలా బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేక అనేక మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై దవాఖానల పాలయ్యారని గుర్తు చేశారు.
అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి డబ్బులు గుంజడం తప్ప ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడం లేదని దుయ్యబట్టారు. ప్రజల నుంచి డబ్బులు ఏ విధంగా రాబట్టాలో ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ ఉచితం అన్నారని, అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు, మందు ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక సంక్షేమ పథకాలన్నీ అటకెక్కిన్నట్లు హరీశ్‌రావు ఆరోపించారు. రైతుబీమా ఎగ్గొట్టారని, రైతు బంధు బంద్ పెట్టారన్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టినట్లు ఆరోపించారు. సీఎం ఢిల్లీకి మూటలు పంపేందుకు బిజీగా ఉన్నారని, ఆయనకు విద్యాశాఖను చూసే సమయం ఉండడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం ఇప్పటికీ 44 సార్లు ఢిల్లీకి పోయాడని, మంత్రివర్గ విస్తరణ చేపట్టలేక పోతున్నాడని విమర్శించారు.
దుబ్బాకలో రజినీకాంత్‌రెడ్డి పాఠశాల ఏర్పాటు చేయడం సంతోషకరమని, నిరుపేదలకు ఉచితంగా విద్య అందించాలని హరీశ్‌రావు సూచించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్, దుబ్బాక మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సయ్య , బీఆర్ఎస్ నాయకులు వెంకటనర్సింహారెడ్డి, రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, యాదగిరి, స్వామి, రామస్వామిగౌడ్, వంశీ, నారాగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిద్దిపేట కమాన్, జూన్ 6: ముస్లింలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ నిర్వహించుకుంటారని తెలిపారు. భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన బ్రకీద్ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఈ పండుగ సోదరభావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని, అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని అభిలాషించారు. అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.