మెదక్, జూలై 20 (నమస్తే తెలంగాణ): మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాటు ఏటా వానకాలం ప్రారంభానికి ముందే చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదిలేది. మే నెల చివరి నాటికి టెండరు ప్రక్రియ పూర్తి చేసి, జూన్, జూలై నెలల్లో నీటి వనరుల్లో కొత్తనీరు చేరగానే చేప పిల్లలను వదిలింది.
కాంగ్రెస్ పాలనలో ఈసారి చేపపిల్లల పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా చేప పిల్లలను నీటి వనరుల్లో వదిలింది. తూతూమంత్రంగా పథకాన్ని అమలు చేసింది. కనీసం 20శాతం చేప పిల్లలను చెరువుల్లోకి వదలలేదు. ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో నీలినీడలు
అలుముకున్నాయి.
వర్షాకాలానికి ముందే చేప పిల్లల కోసం టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే చెరువులు నిండే అదును వరకు చేప పిల్లల పంపిణీ సాధ్యమవుతుంది. ఆలస్యమైతే చేప పిల్లలను చెరువుల్లో వదలడం అసాధ్యమని మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో 308 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. 16,861 మంది సభ్యులు ఉన్నారు. 21 మండలాల పరిధిలో 1654 చెరువులు ఉన్నాయి. వీటితో పాటు పోచారం ప్రాజెక్టు, ఘణాపూర్ ఆనకట్ట, హల్దీవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. చెరువుల్లో, ప్రాజెక్టులో కలిసి గతేడాది వర్షాకాలంలో 64 లక్షల చేప పిల్లలు వదిలారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మత్య్సకారులు చేపలను మార్కెట్కు తరలించి విక్రయించేందుకు సబ్సిడీపై వాహనాలు, వలలను అందజేసి అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అమలు చేయకపోవడంతో మత్య్సకారులు మండిపడుతున్నారు. ఉపాధి కోల్పోతామని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మెదక్ జిల్లాలో 2022-23వ సంవత్సరంలో 3 కోట్లు, 2023-24లో 2.57 కోట్ల చేప పిల్లలను ఆగస్టు మొదటి వారంలోనే చెరువుల్లో వదిలి మత్స్యకారులకు ఉపాధి చూపారు.
చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర మత్స్యశాఖ స్పష్టత ఇవ్వడం లేదని మత్స్య సహకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అదును దాటిన తర్వాత చేప పిల్లలను చెరువుల్లో వదిలితే వాటి ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఆగస్టు, సెప్టెంబర్ రెండో వారంలోపే చేపపిల్లల పెంపకాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే చేపల ఉత్పత్తి బాగా ఉంటుంది. లేదంటే ఏ రకమైన చేప అయినా సరే బరువు అంతంతమాత్రమే ఎదుగుతుందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. చేప పిల్లల పంపిణీ ఆలస్యం చేస్తే కాంట్రాక్టర్లు నాసిరకం చేపపిల్లలు సరఫరా చేసే అవకాశం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లాలో 308 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో గతేడాది 83 చెరువుల్లో కేవలం 64 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో 2020-21లో 1211 చెరువుల్లో 4.14 కోట్ల చేప పిల్లలను వదిలారు. 2021-22లో 1601 చెరువుల్లో 4.93 కోట్లు, 2022-23లో 1494 చెరువుల్లో 4.74 కోట్లు, 2023-24లో 1414 చెరువుల్లో 4.63 కోట్ల చేప పిల్లలను వదిలారు. బీఆర్ఎస్ హయాంలోనే తమకు ఉపాధి లభించిందని మత్స్యకారులు గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించింది. గతేడాది మెదక్ జిల్లాలో కేవలం 82 చెరువుల్లో 64 లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏటా 4 కోట్లకు పైగా చేప పిల్లలను పంపిణీ చేసేవారు. మత్స్యకారుల అభివృద్ధికి కేసీఆర్ సార్ కృషిచేసిండ్రు. మాకు అప్పుడు లబ్ధి జరిగింది. ఈ ఏడాది కూడా అన్ని చెరువులు, కుంటల్లో చేపపిల్లల్ని పంపిణీ చేయాలి. కుంటలకు కూడా పన్నులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వంద ఎకరాల్లోపు ఉన్న చెరువుల్లో, కుంటల్లో కూడా చేపపిల్లల్ని వదలాలి.
– కృష్ణ, మత్స్యకార సొసైటీ డైరెక్టర్, మెదక్ జిల్లా
ఇప్పటి వరకు ప్రభు త్వం నుంచి స్పష్టత రాలేదు. చేప పిల్లల టెండర్ల విషయంపై ఉన్నతాధికారుల నుం చి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తేనే జిల్లా స్థాయిలో చేప పిల్లలకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత చేప పిల్లల పంపిణీ జరుగుతుంది.
– మల్లేశం, జిల్లా మత్య్సశాఖ అధికారి మెదక్