నారాయణఖేడ్/నాగల్గిద్ద/కంగ్టి/మనూరు, మార్చి 21: పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇంటింటికీ నల్లాలతో నీటిని సరఫరా చేసిన మిషన్ భగీరథ పథకం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పథకం నిర్వహణపై పర్యవేక్షణ కరువై గ్రామాలకు రోజుల తరబడి నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిక్కుతోచని స్థితిలో వ్యవసాయ బోర్లు, ప్రైవేట్ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. వేసవి ఆరంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మున్ముందు వచ్చే నీటి కష్టాలను తలుచుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉత్పన్నం కాలేదు. మహిళలు నీళ్లకోసం బిందెలతో పొలాల వెంట వెళ్లే దృశ్యాలు బీఆర్ఎస్ హయాంలో కనుమరుగయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మెల్లమెల్లగా తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్న దృశ్యాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిషన్ భగీరథ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం ఫలితంగానే రోజుల తరబడి నీరు గ్రామాలకు సరఫరా కావడం లేదని తెలుస్తున్నది.
సమస్య మరింత తీవ్రతరం కాకమునుపే మిషన్ భగీరథ పథకం నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ప్రజలు దాహం తీరే దారులు వెతుక్కుంటూ వెళ్లక తప్పదని చెప్పడంలో సందేహం లేదు. గ్రామాల్లో నీటి సమస్యపై ‘నమస్తే తెలంగాణ’ దృష్టి సారించి నాగల్గిద్ద, కంగ్టి, మనూరు మండలాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో గ్రామాలు, తండాల్లో నెలకొని ఉన్న నీటి సమస్య బహిర్గతమైంది. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం.