సిద్దిపేట, నవంబర్ 16: ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వ తీరుతో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారంలో ఆదివారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసి వారం రోజులు దాటుతున్నా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయడం లేదన్నారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. ధాన్యం అన్లోడ్ చేసేందుకు మిల్లులు టైఅప్ చేయాలన్నారు. సన్నాలకు పోయిన యాసంగి, ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మక రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, మకల కొనుగోలును ప్రభుత్వం ఆలస్యం చేయడంతో రైతులకు నష్టం జరిగిందన్నారు. మక రైతులకు డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతుల పరిస్థితి ఆగమైందని, కేంద్రంలోని బీజేపీ రైతులను అరిగోస పెడుతున్నట్లు విమర్శించారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామంటే ఎట్లా అని అన్నారు. కొన్నిచోట్ల 11, 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చిందన్నారు. మిగిలిన పత్తిని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. పత్తి రైతులకు బీజేపీ ప్రభుత్వం, మక రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్లు హరీశ్‌రావు విమర్శించారు.
రేవంత్‌రెడ్డి రైతులను అన్ని రకాలుగా మోసం చేశాడని, రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండన్నారు.. బోనస్ లేదని, పంటల బీమా లేదని.. సగం మందికే రుణమాఫీ చేశారని విమర్శించారు. పోయిన యాసంగిలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు, ఈ ఏడాది తుపాన్‌తో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందలేదన్నారు. పంటల బీమా చేసి ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేవన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కనకరాజు, నాయకులు కీసరి పాపయ్య, మాజీ సర్పంచ్‌లు బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.