చెరువు.. పల్లెకు ఆదెరువు అంటారు. ఒక్క చెరువు ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. చేపల పెంపకంతో మత్స్యకారులు, ముదిరాజ్‌లు ఉపాధి పొందుతుంటారు. చెరువు నీటితో రైతులు పంటలు పండించుకుంటారు. చెరువు కట్టపై ఈత చెట్ల పెంపకంతో గౌడన్నలు కల్లుగీసి అమ్మి జీవనోపాధి పొందుతుంటారు. రజకులు బట్టలను ఉతికి కులవృత్తిపై ఆధారపడి జీవిస్తుంటారు. పశుపక్ష్యాదుల గొంతుతడుపుతుంది చెరువు. నీరు లేనిదే సమస్త జీవరాశులు మనుగడ చాలించలేవు. ఒక్క చెరువు నిర్మాణంతో ఆ ఊరి స్థితిగతులే మారుతాయి. తెలంగాణ ప్రజల జీవన విధానంలో చెరువులకు ప్రముఖ స్థానం ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో ‘మిషన్ కాకతీయ’ పథకంలో అనేక చెరువులను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తెచ్చింది. ఇదేకోవలో సాగునీటి వసతి అంతంతమాత్రంగా ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు ఆదెరువు కల్పించేందుకు అప్పటి సీఎం కేసీఆర్ కొత్త చెరువులు మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త చెరువుల నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
నారాయణఖేడ్, మార్చి 25: వరద నీటిని ఒడిసి పట్టి రైతుల పొలాలకు మళ్లించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి 8 కొత్త చెరువుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నాగల్గిద్ద మండలంలోని ఇరక్‌పల్లి-1, ఇరక్‌పల్లి-2, ఉట్పల్లి, మోర్గి, ఏస్గి, కేశ్వార్లలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్‌లో, కంగ్టి మండలం చుక్కల్తీర్థ్లలో చెరువుల నిర్మాణానికి రూ.56.47 కోట్ల నిధులు, భూసేకరణ నిమిత్తం మరో రూ.19 కోట్లు అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ చెరువుల నిర్మాణం పూర్తయితే 1810 ఎకరాల ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. భూగర్భ జలాల వృద్ధికి దోహదం చేయనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెరువుల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు.
కొత్త చెరువుల నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. భూగర్భ జలాల కొరత తీవ్రంగా ఉన్న నారాయణఖేడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన చెరువుల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కనీసం ఒక్క చెరువు సైతం లేని నాగల్గిద్ద మండలంలో ఏకంగా 6 చెరువుల నిర్మాణానికి పూనుకోవడం విశేషం. సాగునీటి వనరుల లేమితో వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఇక్కడి రైతులకు దశలవారీగా సాగునీటిని చేరువ చేయాలనే కేసీఆర్ గొప్ప సంకల్పంతో కొత్త చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చెరువుల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేసి 8 చెరువుల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నడుంబిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెరువుల నిర్మాణంపై చిన్నచూపు చూస్తున్నది.దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
8 కొత్త చెరువుల నిర్మాణానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టి సర్వే వేగంగా పూర్తి చేయించింది. చెరువుల పరిధిని నిర్ధారించి చుక్కల్తీర్థ్ చెరువు కోసం 27 ఎకరాలు, ఏస్గీ చెరువు కోసం 14 ఎకరాలు, కేశ్వార్ చెరువు కోసం 19 ఎకరాలు, జగన్నాథ్‌పూర్ చెరువు కోసం 7 ఎకరాల మేర భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. చుక్కల్తీర్థ్ రైతులకు పరిహారం సైతం అందజేశారు. మిగతా మూడు చెరువుల భూసేకరణకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం చెరువుల నిర్మాణానికి అవరోధంగా మారింది. ఇరక్‌పల్లి-1, ఇరక్‌పల్లి-2, ఉట్పల్లి, మోర్గి చెరువులకు సంబంధించి అప్పట్లోనే సర్వే పూర్తయి భూసేకరణ చేపట్టి పరిహారం అందజేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రీనోటిఫికేషన్‌కు అడుగులు వేస్తుండడంతో ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చి మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో 4 చెరువుల నిర్మాణ పనులకు అవరోధంగా మారింది. నిర్వాసితులకు పరిహారం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే రైతులతో సంప్రదింపులు జరిపి వారిని సంతృప్తిపర్చి, భూసేకరణ సజావుగా జరిగేలా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎలాంటి కృషిచేయడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరు చూస్తుంటే కొత్త చెరువుల నిర్మాణం అటకెక్కించినట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
మా గ్రామ శివారులో నిర్మిస్తున్న చెరువు పనులు త్వరగా పూర్తి చేయాలి. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృషి మూలంగానే మా గ్రామానికి చెరువు మంజూరైంది. వెంటనే పనులు ప్రారంభం కావాలనే ఉద్దేశంతో భూపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి భూనిర్వాసితులకు సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో చెరువు పనులు ప్రారంభమయ్యాయి. దశాబ్దాలుగా చెరువు కోసం అనేక ప్రయత్నాలు చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకుని చెరువు మంజూరు చేసింది.
-రమేశ్ పాటిల్, మాజీ సర్పంచ్, సుక్కల్తీర్థ్
చెరువుల నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోతున్న నిర్వాసితులు ప్రభుత్వం నిర్దేశించిన పరిహారం తీసుకున్న పక్షంలో చెరువుల పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. నిర్వాసితులకు పరిహారం విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టు ద్వారా పరిహారం తీసుకునే వీలుంది. పరిహారం సంతృప్తికరంగా లేదని కోర్టు భావించి ఆదేశాలిస్తే కోర్టు ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లిస్తాం. నిర్వాసితులెవరూ పరిహారం విషయంలో ఎలాంటి అపోహలకు లోను కాకుండా చెరువుల నిర్మాణ పనులకు సహకరించాలి.
– విజయభాస్కర్, నీటి పారుదలశాఖ డిప్యూటీ ఈఈ, నారాయణఖేడ్