సంగారెడ్డి, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ):బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు ప్రొటోకాల్ అమలు మొదలు వారి నియోజకవర్గాలకు నిధులు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నది. ఈ విషయమై ఎమ్మెల్యేలు పలుమార్లు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు నిధులు, సంక్షేమ పథకాల కేటాయింపులో ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినప్పటికీ కాంగ్రెస్‌లో చేరడంతో పటాన్చెరు నియోజకవర్గానికి రేవంత్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేస్తున్నది. రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోరినా ఇవ్వడం లేదు. అలాగే రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఓటమిపాలై నియోజకవర్గ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలు చెప్పిన పనులు జరగడంతో పాటు సంక్షేమ పథకాలకు అమలులోను వారిమాటే చెల్లుబాటు అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇన్చార్జిలు సూచించిన, సిఫార్సు చేసిన వారికే సంక్షేమ పథకాలు దక్కుతున్నాయి. జిల్లా అధికారులతోపాటు నియోజకవర్గస్థాయి అధికారులు కాంగ్రెస్ ఇన్చార్జిలకు ప్రాధాన్యత ఇస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎలాంటి అధికారిక హోదా లేనప్పటికీ నియోజకవర్గస్థాయి అధికారులు, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదం అవుతున్నది. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్‌తో సహా ఇతర అధికారుల వద్ద నియోజవర్గ అభివృద్ధ్దిపై నిర్వహిస్తున్న సమావేశాలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను అహ్వానం పలకడం లేదు.
అలాగే ప్రొటోకాల్ అమలు విషయంలోనూ అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏ హోదాలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, సమీక్షా సమావేశాల్లో జగ్గారెడ్డి ఒక్కరే కాదు ఆయన సతీమణి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి కూడా పాల్గొంటున్నారు కదా అంటూ కాంగ్రెస్ నాయకులు, అధికారులు వివరణ ఇవ్వడం కొనమెరుపు.జహీరాబాద్ నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ప్రొటోకాల్ అమలు చేయడం లేదని, నియోజకవర్గ ఇన్చార్జి సూచించిన, సిఫార్సు చేసిన వారికే సంక్షేమ పథకాలు దక్కుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో రేవంత్ సర్కార్ వివక్ష చూపుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించింది. ఇండ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేసింది. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మెజార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నుంచి ఉన్నప్పటికీ, వారిని ఇందిరమ్మ కమిటీల్లోకి తీసుకోలేదు. కాంగ్రెస్‌కు చెందిన నాయకులను మాత్రమే ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
నియోజకవర్గానికి చెందిన 3500 లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే కోటా కింద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు 1400 ఇండ్ల్లను అనధికారికంగా కేటాయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు సిఫార్సు చేసిన వారికే ఇందిరమ్మ ఇండ్లు దక్కాయి. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు తమకు 40శాతం కోటా అంటే 1400 ఇండ్లు కేటాయించాలని పలుమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం, జిల్లా మంత్రి పట్టించుకోవడం లేదు. ఇటీవల చింతాప్రభాకర్, మాణిక్‌రావు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌ను కలిసి తమకు 1400 ఇండ్ల కోటా ఇవ్వాలని కోరారు.
దీంతో ఆయన సానుకూలంగా స్పందించి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 40శాతం కోటా ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ సిఫార్సు చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 40శాతం కోటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. 40 శాతం ఇందిరమ్మ ఇండ్ల కోటాపై ఎమ్మెల్యే మాణిక్‌రావు జిల్లా కలెక్టర్‌ను కలవగా, అలాంటి జీవో ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారని, ఆమె మాటలు తనను తీవ్రంగా బాధించాయని ఎమ్మెల్యే మాణిక్‌రావు ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహిరంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే మాణిక్‌రావు హెచ్చరించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి సిఫార్సు చేసినా 40 కోటా అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు తమను కలిసి ఇందిరమ్మ ఇండ్ల్లు మంజూరు చేయించాలని కోరుతున్నారని, కాంగ్రెస్ పార్టీనాయకులు కొంత మంది పేదలపై బీఆర్ఎస్ ముద్రవేసి ఇందిరమ్మ ఇండ్లు రాకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని పేదలకు న్యాయం జరిగేందుకు వీలుగా తమకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో 40శాతం కోటా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు డిమాండ్ చేస్తున్నారు.