సిద్దిపేట, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట అంటేనే సీఎం రేవంత్‌రెడ్డికి కడుపుమంట ఉందని, ఈ ప్రాంతంపై వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నాడని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దొంతుల సురేశ్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ సీనియర్ నాయకుడు పాషా, పలువురు నేతలు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట మున్సిపాలిటీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు మీ దగ్గరకు వచ్చి, పదవులు, డబ్బుల ఆశ చూపిస్తారని, వారిమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు హరీశ్‌రావు సూచించారు. రేవంత్‌రెడ్డికి సిద్దిపేటపై ఈర్ష్య ఉందని, అందుకే సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కాలేజీని, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని రద్దు చేశాడన్నారు. కోమటి చెరువు వద్ద కడుతున్న శిల్పారామం పనులు సగంలోనే ఆపేశారన్నారు. పేదల వైద్యం కోసం నిర్మిస్తున్న వెయ్యి పడకల దవాఖాన పనులు 90శాతం పూర్తయినా, మిగతా 10 శాతం పనులు పూర్తిచేయించకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. కాబట్టి మన సిద్దిపేటను మనమే కాపాడుకోవాలన్నారు.
వచ్చే సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హామీలు,ఆరుగ్యారెంటీలపై గ్రామ, వార్డు సభల్లో ప్రజలు ప్రశ్నించి, నిలదీయడంతో…ఏమి పాలుపోక సీఎం కేరళం పారిపోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పథకాలు అన్నీ ఈ కాంగెస్ ప్రభుత్వం బంద్పెట్టిందన్నారు. ఒక్క హామీ, పథకం అమలు చేయడం లేదన్నారు. హైడ్రా ఏర్పాటు చేసి పేదల బతుకులను ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. అమీన్ పూర్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా శని, ఆదివారాల్లో పేదల ఇండ్లను కూల్చేశారన్నారు.
కనీసం ఇంట్లోని వస్తువులు కూడా తీసుకోనివ్వకుండా కట్టుబట్టలతో వాళ్లను రోడ్డున పడేశారన్నారు. హైడ్రా అంటే పేదల బతుకులు ఆగం చేయడానికా..? ప్రభుత్వమంటే బుకెడు బువ్వ, తలదాచుకునే నీడ ఇవ్వాలి కానీ.. ఉన్న నీడను లాకొని పేదల ఇండ్లు కూలగొడతారా? అని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్,బీజేపీ ఒక్కటే అన్నారు.మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, నాయకులు సంపత్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సాయిరామ్ పాల్గొన్నారు.