మిరుదొడ్డి, జూన్ 19 : ఆరుగాలం కష్టపడి పడించి విక్రయించిన పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆరోపించారు. పొద్దు తిరుగుడు ధాన్యాన్ని విక్రయించి 75 రోజులు గడుస్తున్నా నేటికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించక పోవడంలో ఆగ్రహానికి గురైన రైతులు గురువారం సిద్దిపేట జిల్లా తొగుట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రైతులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొద్దు తిరుగుడు సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. తొగుట సెంటర్ పరిధిలో నాలుగు వందల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు అంటే ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం రోడ్ల మీదికి రావడమేనా అంటూ ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికల పేరుతో రైతులను మభ్య పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బకాయి పడిన పొద్దుతిరుగుడు రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ఆందోళన వద్దకు పోలీసులు చేరుకొని సముదాయించడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు నర్సింహులు, వెంకట్రెడ్డి, బాగిరెడ్డి, అశోక్, రాములు, స్వామిగౌడ్, రైతులు పాల్గొన్నారు.