సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ పటాన్ చెరు/అమీన్పూర్, డిసెంబర్ 9: చాలీచాలని జీతాలు.. కూలీ నాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పేదలకు ఆ పల్లెలే ప్రపంచం. ఇన్నాళ్లు ఉన్నది తిని.. తృప్తిగా బతుకుతున్న పేదోడిని ఆర్థికంగా నలిపేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. గ్రేటర్ చుట్టూ ఔటర్ లోపల విస్తరించి ఉన్న 51 గ్రామాల పల్లెవాసుల జేబులను పన్నులతో కొల్లగొట్టేందుకు సమాయత్తమవుతున్నది. పల్లెలకు దూరమై పురపాలికల్లో చేరుతున్న ప్రజలకు ఆస్తి పన్ను గుదిబండలా మారనున్నది. పొట్ట కూటి కోసం పెట్టుకునే కిల్లీ కొట్టు నుంచి కిరాణ దుకాణం వరకు ట్రేడ్ లైసెన్స్‌లు తప్పనిసరికానున్నాయి. మున్సిపాలిటీల్లోకి మారిన తర్వాత ఇంటికే కాదు.. ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలాలకు కూడా పన్నులు వసూలు చేసి రేవంత్ సర్కారు ఖజానా నింపుకోనున్నది.
గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల ముందుగా పేదోడిపై ఆస్తి పన్ను భారం పడనున్నది. వీటితో పాటు ట్రేడ్ లైసెన్స్, మున్సిపాలిటీ నల్లా నీళ్లు, వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ పేరిట మరిన్ని పన్నుపోటులు పడనున్నాయి. ఒక్కో ఇంటిపై అదనంగా ఏటా పన్నుల రూపంలో రూ. 5వేల నుంచి 10వేల వరకు ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేయనున్నది. గ్రామాల్లో ప్రస్తుతం చదరపు గజానికి ఇంటి విలువలో 0.15 నుంచి 1 శాతం మేర పన్ను వసూలు చేస్తుండగా.. మున్సిపాలిటీల్లో చేరగానే అదే ఇంటికి చదరపు అడుగుకు రూ. 10-50 చొప్పున వసూలు చేస్తారు.
150 గజాల ఇంటికి ఏటా సుమారు రూ. 6వేల నుంచి 8వేలు వరకు ఆస్తి పన్ను చెల్లించాల్సిన దుస్థితి రానున్నది. ఒకవేళ నిర్మాణంలో జరిగే చిన్న చిన్న లోపాలను కూడా పరిగణనలోకి తీసుకుని అనధికారిక నిర్మాణం(యూసీ) ట్యాక్స్ పేరిట ఇంటి పన్ను మొత్తానికి సమానంగా ఏటా పెనాల్టీ విధించనున్నది. అదే గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నిర్మించుకునే కమర్షియల్ బిల్డింగులపై ఇకపై రెండింతల మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించాల్సి వస్తే, దానిలో నిర్వహించుకునే దుకాణాలు, షాప్‌లకు అదనంగా రూ.3వేల నుంచి రూ. 50వేల వరకు ట్రేడ్ లైసెన్స్ పేరిట స్థానిక మున్సిపాలిటీలు వసూలు చేయనున్నాయి.
గ్రామాల్లో ఖాళీ స్థలాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మున్సిపాలిటీల్లో ప్లాట్ ధరలో 0.5-0.8 వరకు పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 100 గజాల ఖాళీ ఇంటి జాగాపై కనీసం మున్సిపాలిటీల్లో రూ. 480-1015 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటిపై ఏడాదికి కనీసం రూ. 5వేల నుంచి రూ. 10వేల పన్ను భారం పడనున్నది. గ్రామాల్లో ఉపాధి నిమిత్తం నిర్వహించుకునే హెయిర్ కటింగ్, ఇస్త్రీ దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్‌లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఎవరికీ మినహాయింపుల్లేవు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఇన్నాళ్లు గ్రామాల్లో ఉన్న సౌలతులకు తగినట్టుగానే పన్నులు చెల్లిస్తూ వచ్చారు. ఇప్పుడు పల్లెలు, తండాలు, హామ్లెట్ విలేజీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల పల్లె వసతులకే.. టౌన్ తరహా ట్యాక్సులు అదనంగా చెల్లించాల్సి రానున్నది. మున్సిపాలిటీల్లో మారగానే ఒక్కసారి మౌలిక వసతులు అభివృద్ధి చేసే వీలు లేదు. కానీ పల్లె జనాల నుంచి పన్నుల రూపంలో భారీ మొత్తంలో వసూలు చేసి కాంగ్రెస్ సర్కార్ ఖజానా నింపుకొనున్నది. ఇలా పల్లెకు దూరమై మున్సిపాలిటీల్లో కలుస్తున్న గ్రామీణవాసులపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుపోటు పొడవనున్నది.
రింగు రోడ్డు ఉన్న గ్రామాలను ప్రభుత్వం దగ్గరలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. పంచాయతీలను ఈ ఏడాది ఫిబ్రవరి తొలివారంలోనే రద్దు చేశారు. అనంతరం ప్రత్యేక అధికారుల పాలనను అమల్లోకి తెచ్చారు. రాష్ట్ర, జిల్లా అధికారుల సూచనల మేరకు ఆగస్టులో ప్రత్యేక అధికారులు తూతూమంత్రంగా గ్రామ సభలు పెట్టి పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నామని తీర్మానాలు చేశారు.
సభలకు వచ్చిన ప్రజలు తమకు మున్సిపాలిటీల్లో ఉండడం ఇష్టం లేదని స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోకుండా రికార్డులు తయారు చేశారు. దీంతో సెప్టెంబర్ 3న పటాన్చెరు మండలంలోని ఐదు గ్రామాలు ముత్తంగి, పోచారం, కర్ధనూర్, పాటి, ఘనపూర్, అమీన్‌ఫూర్ మండలంలోని ఆరు గ్రామాలు ఐలాపూర్, ఐలాపూర్ తండా, కృష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, దాయర, సుల్తాన్పూర్లను తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం గెజిట్ వెలువర్చింది. దీంతో ఈ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు చెబితే తక్షణం పూర్తయ్యే పనుల కోసం ఇప్పుడు తెల్లాపూర్, అమీన్ఫూర్లకు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడిన విషయంగా మారింది. కార్యదర్శులకు చెప్పినా పరిష్కారమయ్యే సమస్యలను సైతం మున్సిపల్ అధికారులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ పాలనలో అన్ని పనులకు ప్రత్యేక శాఖ, అధికారులుండటంతో గ్రామీణ ప్రజలకు వారి సేవలు పొందటం కష్టతరంగా మారుతున్నది. అంతకంటే ప్రజల్లో భయం మున్సిపాలిటీ పన్నుల వ్యవహారంలో నెలకొన్నది. పంచాయతీల్లో పన్నులు తక్కువగా ఉండేవి. మున్సిపాలిటీల్లో పన్నుల వడ్డింపు దాదాపు రెట్టింపు ఉంటుందని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
వ్యవసాయాధారిత గ్రామాలు మావి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు పన్నులు తక్కువ ఉండేవి. ఒక ఏడాది పంటలు పండకపోతే పంచాయతీలు పన్నుల వసూళ్లపై బలవంతం చేసేవి కావు. ప్రజలు డబ్బులున్నప్పుడే పన్నులు చెల్లించేవారు. పాలకమండళ్లు కూడా పూర్తిగా పేదలుంటే వారిని అసలే అడిగేవారు కాదు. ఇస్తేనే తీసుకునేవారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో గ్రామాన్ని విలీనం చేశారు. మున్సిపాలిటీ అధికారులు ఇస్తున్న సేవలకంటే పన్నుల వసూళ్లే అధికంగా ఉంటాయి. మున్సిపాలిటీ అధికారులు పన్నులు కచ్చితంగా చెల్లించాలని బలవంతం చేస్తారు. కరెంటు కట్ చేస్తారు. నీళ్లు నిలిపివేస్తారు. అది పన్నుల వసూళ్లకే పరిమితం. ఆ తరువాత వారి సేవలు పొందటం అంత సులువు కాదు. కర్ధనూర్ గ్రామస్తుల తరఫున మేం పంచాయతీల్లోనే ఉండాలని తీర్మానం చేసి చెప్పాం. కానీ అధికారులు రిపోర్టులో అది పెట్టలేదు.
– డి.రాంప్రసాద్, కర్ధనూర్
అధికారుల పాలనలో మోసం జరిగింది. గ్రామ సభలో మున్సిపాలిటీ విలీనంపై మాట్లాడితే ప్రజలు వ్యతిరేకించారు. అయిననూ అధికారులు కర్ధనూర్ను తెల్లాపూర్ మున్సిపాలిటీలో కలిపారు. చిన్న గ్రామ పంచాయతీ ఇది. ఒకప్పుడు జాతీయ నిర్మల్ పురస్కారం పొందిన గ్రామం మాది. సంపూర్ణ పారిశుధ్యంలో, అన్ని రంగాల అభివృద్ధిలో గ్రామానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రజలు కూడా పంచాయతీ పాలనలో చక్కగా చింత లేకుండా ఉన్నాం. ఇప్పుడు మున్సిపాలిటీలో కలపడం వల్ల మా గ్రామం పారిశుధ్యంలో వెనుకబడుతుంది. మున్సిపల్ అధికారులు గ్రామానికి ఇచ్చే సేవలు కూడా తక్కువే. పన్నులు మాత్రం భారీగా విధిస్తారు. మేం ఆ స్థాయి టాక్స్‌లు కట్టలేం. మాకు గ్రామ పంచాయతీలోనే ఉండాలని ఉంది.
– ఎల్వర్తి మల్లికార్జున్, కర్ధనూర్
తెల్లాపూర్ మున్సిపాలిటీకి పోవడం అంటే అంతఈజీ కాదు. కర్ధనూర్ నుంచి పటాన్చెరు వెళ్లాలి, అక్కడి నుంచి లింగంపల్లి చౌరస్తా వెళ్లాలి. లింగంపల్లి నుంచి తెల్లాపూర్ మున్సిపాలిటీకి చేరుకోవాలి. డబ్బులున్న వారికే ఇది సాధ్యం. లింగంపల్లి నుంచి తెల్లాపూర్‌కు రెండోందలు అడుతున్నారు. గరీబోళ్లు వెళ్లగలుగుతారా.? పటాన్చెరు పట్టణం అంటే దగ్గర ఉండేది. మండల కేంద్రం కూడాను. ఎలాగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగవని చెబుతున్నారు. మళ్లీ తీసుకెళ్లి జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అదేదో నేరుగా పటాన్చెరు డివిజన్లో కలిపితే మా కు దగ్గరయ్యేది. ప్ర భుత్వం చేస్తున్న ఈ ప్రయోగంతో ప్రజలకు నష్టమే. ఇంటి పన్నులు భారీగా విధిస్తారని తెలుస్తున్నది. తెల్లాపూర్ అంటే ఐటీ ఉద్యోగు లు, వ్యాపారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉంటున్నారు. హైటెక్ ఏరియా కాబట్టి ఎంత పన్ను వేసినా చెల్లిస్తారు. కర్ధనూర్ లో అవే పన్నులు వేస్తే ప్రజలు కట్టలేరు.
– లక్ష్మణ్, కర్ధనూర్
కర్ధనూర్ను తెల్లాపూర్ మున్సిపాలిటీల కలపొద్దని మీటింగ్‌ల సార్లకు, మేడంలకు కోరినం. కానీ వాళ్లు వినలే. బలవంతంగా మున్సిపాలిటీల కలిపిం డ్రు. ఇప్పటిదాక నీళ్లు రాకున్నా, మురుగు శుభ్రం చేయకున్నా పంచాయతీల వచ్చి చెప్తే వెంటనే నీళ్లు వదిలేది. మురికి శుభ్రం చేసేటోళ్లు. పన్ను ఇవ్వకున్నా ఏమి అనెటోళ్లు కాదు. సర్పంచ్‌లు, మెంబర్లు సార్లకు చెప్పి ఆపేటోళ్లు. ఇప్పుడు టాక్స్‌లు డబుల్ అవుతాయని చెబుతుండ్రు. అంత పెరిగితే ఎట్ల కడుతాం. మాకైతే కర్ధనూర్ను అప్పట్లాగే పంచాయతీగా ఉంచాలని ఉంది. సార్లు ఆ న్యాయం చేయాలే.
– ఎం.బాలయ్య, కర్ధనూర్
టాక్స్‌ల విధింపు సాధారణంగానే ఉం టుంది. కొత్తగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఆయా గ్రామాల పాత టాక్స్‌ల విధానాన్నే అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు పాత టాక్స్‌లే ఉంటాయి. ప్రభుత్వ పాలసీలను, నిబంధనలను అమలు చేయడం మా బాధ్యత. పంచాయతీల కంటే మున్సిపాలిటీల్లో సేవలు నాణ్యతతో ఉంటాయి. అన్ని శాఖల అధికారులు ప్రజాసమస్యలను పరిష్కరిస్తారు. గ్రామాల్లో మున్సిపాలిటీ సేవలు వార్డు కార్యాలయాల్లో పొందేలా చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లోనూ టాక్స్‌లు కట్టే వెసులుబాటు కల్పిస్తాం. పౌరసేవల జాబితాను ప్రదర్శిస్తాం. అధికారుల ఫోన్ నెంబర్లు ప్రజలకు కనిపించేలా పెడతాం. సమస్యలు వస్తే తక్షణం స్పందించి పరిష్కరించేలా చూస్తాం. – సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్, తెల్లాపూర్