సంగారెడ్డి, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించిన విధంగా సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందే వరకు బీఆర్ఎస్ పోరాటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో హరీశ్‌రావు సమావేశం అయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, సాగునీటి పోరాట కార్యాచరణపై చర్చించారు.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 21 ఫిబ్రవరి, 2022న సీఎం హోదాలో కేసీఆర్ నారాయణఖేడ్ పట్టణంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పనులు సైతం ప్రారంభించినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోవటంలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ రైతుల సాగునీటి కల కలగానే మిగిలిందన్నారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితే నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అంది రైతులు బాగుపడతారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రెండు ఎత్తిపోతల పనులు పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆయకట్టు ప్రాంతాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ త్వరలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులు సాగునీటి పోరాటం అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని హరీశ్‌రావు సూచించారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి ప్రాంత రైతులు, ప్రజలు, పార్టీ క్యాడర్‌ను సాగునీటి పోరాటంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డి , కాసాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.