సంగారెడ్డి , డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ), పటాన్చెరు/ అమీన్పూర్: గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో పాలనాపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో తెల్లకాగితం మీద దరఖాస్తు ఇస్తే సమస్య పరిష్కరించుకునే అవకాశం పోనున్నది. ఏదైనా ప్రభుత్వ శాఖలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ సెంటర్లను ఆశ్రయించాల్సిందే. గ్రామాల్లోనూ ఈ గవర్నెన్స్ సేవలు ప్రారంభమైనప్పటికీ..ఇంటర్నెట్ ఆధారిత మౌలిక వసతుల లోపం కారణంగా ఆఫ్‌లైన్ ద్వారా కూడా సేవలు పొందే వెసులుబాటు ఉంది. కానీ మున్సిపాలిటీల్లోకి మారిన తర్వాత ఏ పని కోసమైనా ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి. మున్సిపాలిటీలో చేరగానే పాలనా వ్యవహారాలు మారిపోనున్నాయి.
గ్రామాలకు ఇంటర్నెట్ ఫలాలను అందించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-గవర్నెన్స్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే టీ ఫైబర్ పాలసీని రూపొందించి మిషన్ భగీరథ తరహాలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా కృషి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదు. గ్రామ్ స్వరాజ్ పేరిట గ్రామాల్లో అందే సత్వర సేవలకు మున్సిపాలిటీల్లో కలపడంతో వీల్లేకుండా పోనుంది. గ్రామాల విలీనంతో ఈ వ్యవస్థ నిర్వీర్యం కానుండగా.. మున్సిపాలిటీల్లో అందించే సేవల కోసమైన ఆన్లైన్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వెంబడి తిరగాల్సిన దుస్థితి రానున్నది.
పింఛన్ కోసం సర్పంచుకో, గ్రామ సెక్రెటరీకో దరఖాస్తు చేస్తే మరుసటి నెల నుంచి పింఛన్ పైసలు ఇంటికే వచ్చేవి. విలీన గ్రామాల ప్రజలకు ఆ సౌకర్యం లేదు. కనీసం గల్లీలో మోరీ పారుతుందని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అధికార వికేంద్రీకరణతోనే స్థానికంగా సేవలు అందించాల్సింది పోయి… గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ప్రభుత్వం నుంచి ఏదైనా సేవలు పొందాలంటే గతంలో గ్రామ సచివాలయానికి వెళితే సరిపోయేది. ఇకపై ఆయా గ్రామాల ప్రజలు దూరంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కార్యాలయాలకు వెళ్లాల్సిన దుస్థితి రానున్నది. మున్సిపాలిటీల్లో చేరిన తర్వాత ప్రతిదీ ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలను ఆశ్రయించి, దరఖాస్తుల పేరిట జేబులు ఖాళీ చేసుకుంటే గానీ సాధ్యం కాదు.
మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పన్నుల భారం పడనున్నది. గ్రామ పంచాయతీల్లో ఇప్ప టి వరకు పలు సేవలు అందేవి. ఇప్పుడు మున్సి పాలిటీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మా గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎక్కువగానే ఉన్నాయి. వారికి ఈ నిర్ణయం ఇబ్బందులకు గురిచేస్తుంది..
-ప్రభాకర్, సృజనలక్ష్మీనగర్ కాలనీ, సంగారెడ్డి జిల్లా
మా గ్రామంలో ఎక్కడో కొంతమంది బంగ్లాలు కట్టుకోవడంతో గ్రామమంతా అభివృద్ధి అయిందని అనుకుని పట్టణ పాలన చేయడం పేదలకు భారం మారుతుంది. ఈ చిన్న గ్రామపంచాయతీని మున్సిపాలిటీలో కలిపి ఇంటి పన్నుల మోత మోగించి సామాన్యులపై భారం మోపడం తగదు.
-విక్రమ్ కుమార్, పటేల్‌గూడ, సంగారెడ్డి జిల్లా
మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలవడంతో ఒరిగేది ఏమీలేదు పన్నుల మోత తప్ప. అభివృద్ధి చెందిన పట్టణానికి దగ్గరలో ఉన్నంత మాత్రాన మా గ్రామం అభి వృద్ధి చెందినట్టేనా.పులిని చూసి నక్క వాతలు పెట్టుకు న్నట్లుగా పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీగా ఉంటే స్థానికంగా పౌరసేవలు పొందవచ్చు. బల్దియాలో విలీ నంతో సేవలు భారంగా మారుతాయి.
-అనిల్,దయార గ్రామం, సంగారెడ్డి జిల్లా
మున్సిపల్ పాలన అని మాపై అధికంగా పన్నులు మోపితే ఊరుకునేది లేదు. మాగ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి పన్నులతో నడ్డి విరుస్తామం టే ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధ్దం.పేదలను దృష్టిలో ఉంచుకొని పన్నులు నిర్ధారించాలి. ప్రభు త్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని పేదలను ఇబ్బందులకు గురిచే యవద్దు.జీపీగా ఉంటేనే ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉంటారు.
-ప్రశాంత్,పటేల్‌గూడ, సంగారెడ్డి జిల్లా