సంగారెడ్డి, మే 15(నమస్తే తెలంగాణ): పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు విలవిలలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్నలు, శనగల కొనుగుళ్లు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
జొన్నలు కొనుగోలు చేస్తామని ఈనెల 5న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. కానీ, ఇంత వరకు జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వానకాలం(ఖరీఫ్)లో నష్టాలను చవిచూసిన రైతులు, యాసంగి(రబీ)లో జొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. పంట చేతికి రావటంతో రైతులు జొన్నలు నిల్వచేసి ఇండ్ల్లలో పెట్టుకున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వెంటనే జొన్నలు విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. మక్కల కొనుగోళ్లు పూర్తయిన తర్వాత జొన్నలు కొంటామన్న ప్రభుత్వం, ఆ దిశగా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
గత వానకాలం సీజన్ కలిసి రాకపోవడంతో సంగారెడ్డి జిల్లా రైతులు యాసంగిలో ఎక్కువగా జొన్న సాగుచేశారు. 92,497 ఎకరాల్లో జొన్న సాగుచేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 50,408 ఎకరాల్లో రైతులు జొన్న పండించారు. కంగ్టి మండలంలో అత్యధికంగా 15,495 ఎకరాల్లో రైతులు జొన్నలు వేశారు. అందోల్ నియోజకవర్గంలో 18156, సంగారెడ్డిలో 10,538, జహీరాబాద్ నియోజకవర్గంలో 13,316, పటాన్చెరు నియోజకవర్గంలో 79 ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేశారు. జిల్లా రైతులు అధికంగా హైబ్రీడ్ రకం జొన్న సాగు చేశారు.
హైబ్రీడ్ రకం జొన్న ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం రైతుల వద్ద పెద్దఎత్తున జొన్న నిల్వలు ఉన్నాయి. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు జొన్నలు విక్రయించడం ప్రారంభిస్తున్నారు. జొన్న మద్దతు ధర క్వింటాకు రూ.3699 ఉండగా, ఆర్థిక అవసరాలు ఉన్న కొంతమంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలుకు రూ.2000 నుంచి రూ. 2500 వరకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో మరింత జాప్యం చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జొన్నల కొనుగోళ్లపై కోటా నిబంధనలను విధిస్తూ రైతులను మరింత ఇక్కట్లు పెట్టేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఎకరాకు 14 క్వింటాళ్ల జొన్నలు మాత్రమే రైతుల నుంచి కొనాలనే నిబంధన విధించినట్లు తెలిసింది. యాసంగిలో రైతులు సంగారెడ్డి జిల్లాలో 90 శాతానికి పైగా హైబ్రీడ్ జొన్న సాగు చేయగా, ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఎకరాకు 14 క్వింటాళ్ల జొన్నలు మాత్రమే కొంటే, మిగతా జొన్నలు ఎక్కడ విక్రయించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు విధించకుండా మొత్తం పంటను కొనాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.