నర్సాపూర్, మే30: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు సరిగ్గా జరగక రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు. కేంద్రాల వద్ద వ్యవస్థ సరిగ్గా లేక సమయానికి ధాన్యం కాంటాలు కావ డం లేదన్నారు.
అకాల వర్షం వల్ల ధాన్యం తడిసి అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్లో విత్తనాల కొరత తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. భూమి సారవంతానికి అవసరమైన జీలుగ, జనుము విత్తనాలు అవసరమైన మోతాదులో అందుబాటులో లేవనే సమాచారం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నదన్నారు.
రైతుల ఇబ్బందులు మా దృష్టికి రాగానే వెంటనే వ్యవసాయశాఖ సెక్రటరీ, కమిషనర్‌తో మాట్లాడడం జరిగిందని గుర్తుచేశారు. నర్సాపూర్ నియోజకవర్గానికి అవసరమైన విత్తనాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫోన్లో తెలియజేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుందని, కాంగ్రెస్ చేసే తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.