సంగారెడ్డి, నవంబర్ 7(నమస్తే తెలంగాణ):జిల్లాలో గురుకుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అం దక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుకులాల్లో చాలాచోట్ల సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందిగా కాలం వెల్లదీస్తున్నారు. అధికశాతం గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసేంది. చాలా మటుకు గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. కేసీఆర్ సర్కార్ లో గురుకుల పాఠశాలల్లో సకల వసతులతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు.
మంచి విద్య అందడంతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై శీతకన్ను వేసింది. సంగారెడ్డి జిల్లాలో 12 సోషల్ వేల్పేర్(ఎస్సీ) గురుకుల కళాశాల లు ఉన్నాయి. 7వేల మందికిపైగా బాలబాలికలు ఎస్సీ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. 11 బీసీ గురుకుల కళాశాలల్లో 6వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నా రు. జిల్లాలో 6 గిరిజన గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో 3600 మంది విద్యార్థులు చదవుతున్నారు. 10 కిపైగా మైనార్టీ పాఠశాల, కళాశాలల్లో 6వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.
సోషల్ వెల్పేర్(ఎస్సీ) గురుకుల కళాశాలల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిన్నారంలోని ఎస్సీ గురుకుల కళాశాల, ఎస్టీ గురుకుల కళాశాలలో పారిశుధ్యం, తాగునీటి కొరత సమస్యలు ఉన్నా యి. ఎస్టీ బాలుర గురుకుల కళాశాలకు ప్రహరీ లేదు. నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తిలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో పారిశుధ్యం లోపించింది. పౌష్టికాహారం అందడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కళాశాలలో తాగునీటి కొరత వేధిస్తున్నది. జిల్లాలోని అధికశాతం గురుకుల కళాశాలల్లో సిబ్బంది కొరత ఉంది. రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో బోధనపై ప్రభావం పడుతున్నది. ఇటీవల న్యాల్కల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు, అధికారులు గురుకులాలను పట్టించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
దుబ్బాక/గజ్వేల్, నవంబర్ 7:పేదపిల్లలకు ఉచిత వసతితోపాటు గుణాత్మకమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభు త్వం వీటి నిర్వహణను పట్టించుకోక పోవడంతో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. భవనానికి అద్దె భారీగా చెల్లిస్తున్నా కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అద్దె భవనంలోని ఇరుకైన తరగతి గదుల్లోనే విద్యార్థులు ఓ పక్క విద్యనభ్యసిస్తూ…మరోపక్క బస చేస్తున్నారు. తరగతి గదుల్లోనే తమ బట్టలను ఆరబెట్టుకోవడమే కాకుండా అందులోనే నిద్రిస్తున్నారు. తరగతిగదిలో బట్టలు ఆరబెట్టడంతో దుర్గంధంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
తరగతి గది, వసతి గది ఒక్కటే కావడం సమస్యగా మారింది. విద్యార్థులు చదువుకునేందుకు బెం చీలు, డెస్క్‌లు లేకపోవడంతో నేలపైనే చదువులు కొనసాగుతున్నాయి. 475 మంది విద్యార్థులకు కేవ లం 12 మరుగుదొడ్లు, 12 స్నానపు గదులు మాత్రమే ఉన్నాయి. స్నానపు గదులకు తలుపులు లేకపోవడం తో విద్యార్థులకు సమస్యగా మారింది. విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. ఆరుబయట వర్షంలోనే స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిటికీలకు తలుపులు లేకపోవడంతో రాత్రివేళలో చలి తీవ్రతతో వణుకుతున్నారు. దోమలు, ఈగల సమస్య విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దుబ్బాక పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. ఈ వసతి గృహానికి అద్దె రూ.2. 27 లక్షలు చెల్లిస్తున్నప్పటికీ విద్యార్థులకు మాత్రం వసతులు లేవు.
గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్ రహదారి పక్కన అద్దె భవనంలో వర్గల్‌కు చెందిన ఎస్సీ బాలుర పాఠశాల,కళాశాల కొనసాగుతున్నాయి. ఈ గురుకుల పాఠశాల కిటికీల అద్దాలు పగిలిపోవడంతో రాత్రి సమయంలో దోమలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. గురుకుల పాఠశాల పక్కనే మురుగునీరు చేరడంతో దోమలు వృద్ధి చెంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం వెనకాల మురుగునీటి ప్రవాహంతో దుర్గంధం వెదజల్లుతున్నది. ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 500 పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లుగా విభజించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. కానీ, వారికి కావాల్సిన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.