కల్హేర్, సెప్టెంబర్ 14: బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతి కోసం కృషిచేస్తే సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రిటైర్డ్ ఆర్ఐ నారాయణ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నిజమని ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారన్నారు.
అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదన్నారు. యూరియా సరఫరా చేయడంలో ప్ర భుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను వెంటనే తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లోఓల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు, బోరు మోటర్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో పరుగులు పెట్టిందన్నారు.
కాంగ్రెస్ వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ‘ఎక్కడవేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారైందని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు రేవంత్‌రెడ్డి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. మాజీ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, సిర్గాపూర్ మాజీ ఎంపీపీ మైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ సిర్గాపూర్ మండల అధ్యక్షుడు సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రమేశ్, నాయకులు భూంరెడ్డి, మోహన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, అమన్సాబ్, రాజామల్లు, నాగభూషణం, నాగరాజు, అంజయ్య, హమ్మద్, సత్యనారాయణగౌడ్, సాయాగౌడ్, మోహన్సాగర్, అంజాగౌడ్, మహేందర్‌రెడ్డి, గురునాథ్ పాల్గొన్నారు