దుబ్బాక, మే 2: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వైఫల్యాల పేరిట సంబురాలు చేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రజనీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈవో రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం ఉద యం దుబ్బాక మండలం హబ్షీపూర్ చౌరస్తాలో ధాన్యం కొనుగోలు చేయలని చెల్లాపూర్ రైతులు ధర్నా చేశారు. ఇందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు.
అనంతరం రైతులతో కలిసి దుబ్బాకలో నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక వద్దకు చేరుకున్నారు. సభావేదికపైన కాకుండా ఎమ్మెల్యే రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ప్రజలంతా బాగుంటేనే… ప్రజాపాలన సంబురాలు నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఓ పక్క ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్లపై రైతులు ధర్నా చేస్తుంటే…ఇక్కడ ప్రజాపాలన అంటూ సంబురాలు చేసుకుందామా అని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై ఎమ్మెల్యే మైక్‌లో మాట్లాడుతుండగా అధికారులు మైక్ కట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో తనచేతిలో ఉన్న మైక్‌ను విసిరేశారు. రైతుల సమస్యలు పట్టించుకోరు… వారి గురించి మాట్లాడే అవకాశం లేదా అం టూ అధికారుల తీరును నిరసిస్తూ సభను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే నిరసనకు దిగగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందన్నారు. కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ కేవలం హుస్నాబాద్‌కు పాలనాధికారిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన భగీరథుడు కేసీఆర్ అన్నా రు. దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతారవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి పాల్గొన్నారు.