మెదక్ మున్సిపాలిటీ/పాపన్నపేట, అక్టోబర్ 4: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి మెదక్ జడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సం దర్భంగా హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకొని గులాబీజెండా ఎగురవేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలకు మోసం చేసిందన్నారు. రేవంత్‌రెడ్డి 22 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదన్నారు.
కేసీఆర్ పాలనలో సంక్షేమానికి, అభివృద్ధ్దికి ప్రాధాన్యతనిచ్చి పరిపాలన చేస్తే, రేవంత్‌రెడ్డి చెత్త విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ర్టాన్ని సంక్షోభంలోకి నెట్టాడని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రేవంత్‌రెడ్డి పాలన గాలికి వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొట్టడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రామ పంచాయతీలు సమస్యలకు నిలయంగా మారినట్లు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధిక కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాంధించిన తెలంగాణ గ్రామ పంచాయతీలు, నేడు నిధులు లేక కునారిళ్లాయని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతిని అటకెక్కించారని, పారిశుధ్యం పడకేసినా, విషజ్వరాలు ప్రబలుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సోయిలేదన్నారు. కనీసం పల్లెప్రగతిలో కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే దిక్కులేదని హరీశ్‌రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హరీశ్‌రావు అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చేరిన వారిలో పీఎసీఎస్ మాజీ డైరెక్టర్ తాడేపు మహిపాల్, నీరడి సత్యం, సాయిబాబా, న్యాయవాది శ్రీనివాస్, గాలి మల్లేశం, మేకల మల్లయ్య, కిషన్, గణపతి, వెంకటేశ్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పాపన్నపేట మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు సోములు పాల్గొన్నారు.