గజ్వేల్, మార్చి 22: ‘తలాపునే పారుతుంది గోదారి… మన బతుకులు ఎడారి’ అని ఉద్యమ సమయంలో గోదావరి నది గురించి ప్రతి ఒక్కరం గుర్తుచేసుకునే వాళ్లమని, కేసీఆర్ తన పాలనలో గోదావరి నదిని సస్యశ్యామలం చేసి జీవనదిలా మార్చారని, నేడు కాంగ్రెస్ పాలకులు గోదావరిని ఎడారిగా మార్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ప్రజ్ఞాపూర్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రతి చెరువును నింపడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి తాగునీళ్లను, పరిశ్రమలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ఎన్నడూ లేనివిధంగా ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకాయని, అందులో కేసీఆర్ సంకల్పం ఎంతో ఉందని గుర్తుచేశారు. కేసీఆర్ పట్టుదల, సంకల్పంతోనే కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం, మేడిగడ్డ వద్ద ఏమీ జరిగిందో అనుమానంగానే ఉందని, కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ను ఏమి చేయాలనే కుట్రలో భాగంగానే ఎన్నికల సమయంలో వివాదం చేశారన్నారు. ఢిల్లీ నుంచి ఒక్క రోజులోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) వాళ్లు వచ్చి గోదావరిలోకి దిగి ఫొటోలు తీసుకెళ్లారని, కానీ.. ఎస్ఎల్బీసీ కూలిపోయి నెలన్నర అవుతున్నా ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని కవిత ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికార దాహంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని, ఇప్పుడేమే రైతులు సాగు చేసుకున్న వరి పంటను ఎండబెడుతున్నారని, ఇదంతా కుట్రనే అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. మేడిగడ్డ బాగాలేదని ఒక్క చెరువు నింపకుండా చేశారని, ప్రస్తుతం గోదావరిని ఎడారి చేశారన్నారు. లక్షలాది ఎకరాల్లో వరి పంట ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ వచ్చిన తరువాతనే తుపాకులగూడెం వద్ద సమ్మక్క-సారలమ్మ బ్యారేజీని నిర్మించారన్నారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి మోటర్లను ఆన్ చేద్దామని వెళ్తే అక్కడ బటన్ ఆన్ చేస్తే నీళ్లు రాలేదని, సాగునీటి మంత్రికి ఆ శాఖలో ఏమి జరుగుతుందో కూడా తెలువదని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.
కేవలం రూ.6కోట్లు ఖర్చు చేసి మోటర్లను రిపేర్ చేస్తే, లక్షల ఎకరాల పంట చేతికొచ్చి రైతులు సంతోషంగా ఉంటారని, ఆ సోయి కూడా ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అనంతరం డప్పుచప్పుల మధ్య కళాకారులతో కలిసి కవిత ఆడారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు.