చిన్నకోడూర్, జూలై 18 : “కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్కారు బడులు నిర్వీర్యం అయ్యాయని, విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఏనాడూ సమీక్ష చేయని గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం దాతల సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.చిన్నకోడూర్ పెద్దచెరువు పై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్సీ దేశపతితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టినట్లు గుర్తుచేశారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పిల్లలు బతికుంటే చాలని గురుకులాలకు వెళ్లి తల్లిదండ్రులు వారి పిల్లల టీసీలు తీసుకుపోయే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఎనిమిదేండ్లు వరుసగా ఒకటి రెండు స్థానాల్లో ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 24వ స్థానంలో ఉందన్నారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. విద్యార్థులను క్రీడల్లో భాగస్వామ్యం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడికాయల వెంకటేశం, జింగిటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉమేశ్‌చంద్ర, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు కీసరి పాపయ్య, అబ్బిరెడ్డి, కాల్వ ఎల్లయ్య, మోసార్ల మధుసూదన్‌రెడ్డి, కొండం రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల యువజన విభా గం అధ్యక్షుడు గుండెల్లి వేణు, రాజు, నాయకులు, కార్యకర్తలు,టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.