హుస్నాబాద్‌టౌన్, నవంబర్ 11: సర్వే ఎందుకు సార్ చేస్తున్నారు…. దీంతో మాకు ఏమెస్తదంటూ ప్రజలు ఎన్యూమరేటర్లకు ప్రశ్నలు వేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడటంతోపాటు సమాచార సేకరణ కోసం ఒక కుటుంబానికి గంటకుపైగా సమయం తీసుకోవడంతో ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఒక్కరే సర్వే చేయలేక సహాయకులను నియమించుకుని సర్వే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వేకు సంబధించిన పుస్తకాలు ఆలస్యంగా రావడంతో సర్వే సమాచారాన్ని పుస్తకాలు చూసి సమాధానాలు రాయాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం కొనసాగిన కులగణన సర్వేలో ప్రజలు పలు సందేహాలు వ్యక్తం చేశారు. పథకాలు ఇవ్వడానికి రాలేదని, మీ సమాచారాన్ని ప్రభుత్వం అడుగుతున్నదని రావడం జరిగిందని అధికారులు వివరించారు. సర్వేతో ఏమి లాభం చెప్పండి సార్ అంటూ ప్రజలు అనడంతో మాకు తెలియదని అధికారులు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపించాయి.
రేషన్‌కార్డులు లేవని, ఇందిరమ్మ ఇండ్లు రా లేదని, పింఛన్ పెరగలేదని, గ్యాస్ డబ్బులు పడటం లేదంటూ పలువురు ఎన్యూమరేటర్లకు వివరించారు. గిన్ని ప్రశ్నలు మాకేందుకు సార్లు… ఏదో మా దగ్గర ఏముంటుందంటూ బుడిగజంగాల కాలనీలోని ప్రజలు సర్వేసార్లకు చెప్పా రు. మీదగ్గర ఉన్నవే చెప్పండి అంటూ ఒకింత వేడుకోలుగా వారు సర్వేనిర్వహించాల్సి వస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం సమగ్రకుటుంబ సర్వేనిర్వహించిన క్రమంలోఇంటిల్లిపాది కలిసి సర్వేకు సహకరించగా ప్రస్తుతం సర్వేకు వస్తున్న అధికారులకు ఏదో చెప్పాలి కదా అనేరీతిలో సమాచారం ఇస్తున్న పరిస్థితులు కనిస్తున్నాయి.