సిద్దిపేట, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్‌సెల్ బాట పట్టారు. అన్ని ఆర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ ఎందుకు కాలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రెండు విడతలుగా చేసిన రుణమాఫీలో మాఫీ కాని రైతులు ఇప్పటివరకు 7,836 మంది గ్రీవెన్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 2,479 మంది, మెదక్ జిల్లాలో 2,519 మంది, సంగారెడ్డి జిల్లాలో 2,838 మంది రైతులు ఫిర్యాదు చేశారు.
రైతులు గ్రీవె న్ సెల్‌కు చేసుకున్న ఫిర్యాదులను పరిశీలించి వాటిని అప్లోడ్ చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపుతున్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో చాలా క్షేత్రస్థాయిలోనే తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. తాము కమిషనరేట్‌కు పంపడం వరకు తమ డ్యూటీ అని, ఆ తర్వాత రుణమాఫీ అవుతుందా.. ? కాదా ..? అనేది మాకు సంబంధం లేదు. ఇది వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న మాట. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన వెంటాడుతుంది. తమకు రుణమాఫీ అవుతుందా..? లేదా అని ఎదురుగా వచ్చిన ప్రతి అధికారిని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం గ్రీవెన్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అర్హత ఉన్న రైతులకు తప్పనిసరిగా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావ డం లేదు. అనేక కొర్రీలు పెట్టి రైతులతో చెలగాటం ఆడుతోంది. అర్హత ఉన్న వారు రుణమాఫీ కాకపోతే జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్ సెల్‌కు ఫిర్యాదులు చేయవచ్చని చెప్పింది. దీంతో రుణమాఫీ కాని రైతులు గ్రీవెన్‌సెల్‌కు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. మండల కేంద్రాల్లోని ఏఈవోల ద్వారా గ్రీవెన్ సెల్‌కు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమకు రుణమాఫీ ఎందుకు కాలేదని అడిగితే తాము వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు ఫిర్యాదును పంపడం వరకే తమ డ్యూటీ అని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
రెండు విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,32, 014 మంది రైతులకు రూ.1,596.38 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అనేక కొర్రీలు పెట్టి ఈ రుణమాఫీ చేసింది. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 తేదీ వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ కటాఫ్ పెట్టింది. తొలి విడతలో జూలై 18న లక్ష రూపాయల వరకు, జూలై 30న లక్షన్నరలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ రుణమాఫీలో ప్రభుత్వ నిబంధనలు, టెక్నికల్ సమస్యలతోపాటు రేషన్ కార్డు, రుణఖాతా క్లోజ్ కావడం తదితర సమస్యలతో చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. తొలి విడత, రెండో విడతలో రుణమాఫీ కాని రైతులు గ్రీవెన్‌సెల్‌కు దరఖాస్తు చేసుకుంటే వాటిని వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు అప్లోడ్ చేస్తున్నారు.
ప్రధానంగా వచ్చిన వాటిలో ఆధార్ కార్డులోని పేరు, రుణఖాతాలోని పేరు వేరుగా ఉన్నవి, కుటుంబసభ్యుల నిర్ధారణ చేయవలిసి ఉన్నవి వచ్చాయి. ఆధార్‌లోని పేరు, రుణ ఖాతాలోని పేరు వేరుగా ఉండ డం, కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి, కుటుంబ సర్వీసు పింఛన్‌దారుడు, పట్టా పాసుపుస్తకం లేకపోవడం, పట్టా పాస్‌పుస్తకం ఆధార్‌లోని పేరు, రుణ ఖాతాలోని పేరు వేరుగా ఉన్నవి వచ్చాయి. రేషన్‌కార్డు లేని వారు. డీబీటీ ఇష్యు, ఖాతా నెంబర్లు సరిగా లేనివి, ఆధార్‌లోని పేరు, రుణ ఖాతాలోని పేరు వేర్వేరుగా ఉన్నవి. మంజూరైన రుణం కన్నా డిసెంబర్ 9, 2023 నాటికి బకాయి ఉన్న వడ్డీ ఎక్కువగా ఉన్నది. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
పేర్లు తప్పులు, ఆధార్‌లో ఒకటి క్రాప్ లోన్‌లో మరోటి ఉండడం. ఆధార్ నెంబర్ అనుసంధానం కానివి, ఆధార్‌కార్డుకు క్రాప్‌లోన్‌కు సరిపోని ఆధార్ నెంబర్, రేషన్ కార్డు లేకపోవడంతో వారికి మాఫీ కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల రైతు తన భూమిని అమ్ముకుంటారు. అమ్ముకునే సమయంలో మొత్తం క్రాప్‌లోన్ కడుతాడు. ప్రభుత్వ రుణమాఫీలో అతడికి రుణమాఫీ వస్తుంది. కానీ బ్యాంకర్లు ఆ రైతుకు రుణఖాతా లేదు కనుక రుణమా ఫీ ఇవ్వమంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ రైతుకు రుణమాఫీకి అర్హుడైనప్పటికీ బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదు. ఇలా చాలామంది రైతులు ఉన్నారు.