సంగారెడ్డి మే 2(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచింది. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.933 పెంచింది. దీంతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3315కి చేరుకున్నది. ఐదు నెలల్లో మోదీ ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను మొత్తం రూ.1491 పెంచింది. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర పెంచిన కేంద్రం త్వరలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడంతో రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, క్యాటరింగ్, కర్రీ పాయింట్, వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. హోటళ్లు, రెస్టారెంట్ల భోజనాలు, బిర్యానీలతోపాటు ఇతర భోజన పదార్థాల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వీధి వ్యాపారులు సైతం టిఫన్ల ధర పెంచేందుకు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయడం లేదు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు వాడుతున్న రెస్టారెండ్లు, హోటళ్లు, వీధి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరతకారణంగా వ్యాపారులు బ్లాక్మార్కెట్లో రూ.5వేల నుంచి రూ.7వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తున్న సమయంలోనే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.993 పెంచింది. ఇది వరకు కమర్షియల్ సిలిండర్ ధర రూ.2322 ఉండగా ఇప్పుడు పెంచిన ధరతో కలిసి కమర్షియల్ సిలిండర్ ధర సంగారెడ్డి జిల్లాలో రూ.3315 చేరుకుంది. ఐదు నెలలుగా మోదీ సర్కార్ కమర్షియల్ సిలిండర్ ధర పెంచుతూనే వస్తుంది.
జనవరిలో రూ.111, ఫిబ్రవరిలో రూ.49, మార్చిలో రూ.144, ఏప్రిల్‌లో రూ.194, మేలో రూ.993 పెంచింది. ఐదు నెలల్లో కమర్షియల్ సిలిండర్‌పై మోదీ ప్రభుత్వం రూ.1491 ధర పెంచింది. సంగారెడ్డి జిల్లాలో 35 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీల పరిధిలో 6,14,046 డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు, 80,502 దీపం ఎల్పీజీ కనెక్షన్లు, 1796 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 35 గ్యాస్ ఏజెన్సీల్లో కేవలం 22 ఏజెన్సీల పరిధిలో మాత్రమే 1796 కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సంగారెడ్డితోపాటు పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట పట్టణ ప్రాంతంలో మాత్రమే రెస్టారెంట్లు, హోటళ్లు, వీధి వ్యాపారులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. జిల్లాలోని 1796 వాణిజ్య సిలిండర్ల వినియోగదారులపై ప్రతి సిలిండర్‌పైన రూ.993 అదనపు భారం పడనుంది.
కేంద్రం పదే పదే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెండటంపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర పెంచడంతో హోటల్, రెస్టారెంట్, వీధి వ్యాపారులు భోజనాలు, బిర్యానీలు, టిఫిన్ల ధరలను ఇది వరకే పెంచారు. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర మరింత పెరగడంతో బీర్యానీలపై రూ.50, భోజనాలపై రూ.30, టిఫిన్లపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా ధరలు పెరిగే అవకాశం ఉందని సంగారెడ్డికి హోటల్ వ్యాపారి శివ తెలిపారు. కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధర పెంచి వ్యాపారులు, ప్రజలపై ఆర్థిక భారం మోపుతుంది. అదే సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో బ్లాక్ మార్కెట్లో వ్యాపారులు అదనంగా డబ్బులు చెల్లిం చి సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది.
మోదీ సర్కార్ గృహ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5కేజీల ఎల్టీఎఫ్ సిలిండర్ ధర కేంద్రం పెంచింది. ఇది వరకే 5 కేజీల ఎల్టీఎఫ్ సిలిండర్ ధర రూ.549 ఉండగా ఇప్పుడు రూ. 810.50కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 14కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.965 ఉంది. త్వరలో గృహ వినియోగ సిలిండర్ ధర పెంచనున్నట్లు తెలుస్తుంది.
రామచంద్రాపురం, మే 2: కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి రూ.993కి పెంచడం వల్ల హోటళ్లపై ఎక్కువ భారం పడుతున్నది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సరఫరా సరిగ్గా లేదు..దీనికి తోడు ఇప్పుడు గ్యాస్ ధర పెంచడంతో ఫుడ్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతున్నారు. గ్యాస్ సరిగ్గా సరఫరా లేక కొన్ని చోట్ల హోటళ్లు మూతపడుతున్నాయి. టిఫిన్ సెంటర్లు నిర్వహించే వ్యాపారులు, మీడియం రేంజ్ హోటళ్ల వ్యాపారులు గ్యాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి బ్లాక్ మార్కెట్ పెరిగింది. గ్యాస్ కొరత, ధర పెంపుతో కస్టమర్లపైన కూడా భారం పడుతుంది. హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో రేట్లు పెరగడంతో గిరాకీలు కూడా తగ్గాయి. కేంద్రం ప్రభుత్వంతో సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదు.
– శివ, బావర్చి హోటల్ మేనేజర్, ఆర్సీపురం (సంగారెడ్డి జిల్లా)