జిన్నారం, ఏప్రిల్ 30: కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని ఐకేపీ సిబ్బందిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. జిన్నారం మం డల కేంద్ర శివారులోని మినీ స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. గన్నీసంచుల కొరత, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు.
మిల్లర్లు లోడింగ్, అన్లోడింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. రైతులు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తేమశాతాన్ని ప్రతిరోజు పరిశీలించి, సకాలంలో ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర నిర్వాహకులను కలెక్టర్ హెచ్చరించారు.
తాలు లేకుండా సరి చూసుకోవాలని, తేదీ, రైతు పేరు, ఫోన్ నెంబర్, ధాన్యం కొనుగోళ్ల పూర్తి వివరాలతో రిజిస్టర్లను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, ప్యాడీ క్లీనర్, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులు గడువులోగా డబ్బులు చెల్లించాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, పటాన్చెరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, తహసీల్దార్ భిక్షపతి, రెవెన్యూ సిబ్బంది, ఐకేపీ ఏపీఎం నరేందర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.