గజ్వేల్, సెప్టెంబర్ 3: సీజనల్ వ్యాధులతో దవాఖానకు వచ్చే రోగుల పట్ల వైద్యులు అలసత్వం వహించొద్దని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని జిల్లా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ జ్వరంతో దవాఖానకు వచ్చే రోగులకు తక్షణమే డెంగీ పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలన్నారు. సీజనల్ వ్యాధు లు ప్రబలుతున్న దృష్ట్యా దవాఖానలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి జ్వరాలతో వచ్చే వారికి చికిత్సలు అందించాలన్నారు.
అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కాలం చెల్లిన మందులు ఉపయోగించరాదన్నారు. డయాలసిస్ సేవల కోసం వచ్చే రోగుల జాబితాను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పిల్లల వార్డులో అప్రమత్తంగా ఉండి నవజాత శిశువులకు ఇంక్యూబేటర్ సేవలు అందించాలని, దవాఖానను శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలని సూపరింటెండెంట్ సాయికిరణ్కు సూచించారు. ఆర్డీవో బన్సీలాల్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు.
కోనాపూర్ చెరువును పరిశీలించిన కలెక్టర్
భారీ వర్షాలతో నిండిన కోనాపూర్ చెరువును పరిశీలించి రెవె న్యూ అధికారులు, రైతులతో మాట్లాడి కలెక్టర్ మనుచౌదరి వివరాలు తెలుసుకున్నారు. చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో సాగు చేసిన పంటలు ముగినిపోతున్న విషయాన్ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చెరువు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారడంతో గండికొట్టి నీటిని కిందికి వదలాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. దీంతో వెం టనే గండికొట్టి నీటిని కిందికి వదిలారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలతో పూర్తిగా నిండిన చెరువులు, కుంటలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి చెరువు కట్టలు తెగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున రైతులు వాటిని దాటకుండా అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈ చాందిరామ్, ఏఈ శ్రీకాంత్, తహసీల్దార్ శ్రవన్, ఆర్ఐ కృష్ణ ఉన్నారు.