సిద్దిపేట కలెక్టరేట్, నవంబరు 20: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, రైతులను ఒప్పించి సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్‌ఫెడ్ అధికారులకు సూచించారు. ఆయిల్‌పామ్ సాగుపై బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ పెంపకంతో రైతులకు రెగ్యులర్‌గా ఆదాయం పొందవచ్చని, అంతర పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.
నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్ ప్యాక్టరీ నిర్మాణం వేగంగా జరుగుతున్నందున రైతులకు మార్కెటింగ్ సౌకర్యం సులభతరం అవుతుందని తెలిపారు. రైతులతో సమావేశాలు నిర్వహించి సాగుకు ముందుకు వచ్చేలా కృషిచేయాలన్నారు. వ్యవసాయ క్లస్టర్ల వారీగా లక్ష్యం నిర్దేశించుకొని పంట సాగుచేయించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు రెగ్యులర్‌గా విజిట్ చేసి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, హార్టికల్చర్ అధికారి సువర్ణ, వ్యవసాయ అధికారి రాధిక పాల్గొన్నారు.