సిద్దిపేట కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 23: సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ, గురుకులాలు, మోడల్, కేజీబీవీ స్కూళ్లు, ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు మనుచౌదరి, రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరాల్లో జిల్లాల్లోని విద్య, సోషల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్, సివిల్ సైప్లె, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆహారం అందించే ప్రతి విద్యాసంస్థల్లో నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని మాత్రమే అందించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకశాతం క్వాలిటీ కూడా తగ్గకూడదని తెలిపారు. దీనికోసం జిల్లా స్థాయి ఫుడ్ సేప్టీ కమిటీ వేస్తున్నామని, ఈ కమిటీ అదనపు కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తుందని తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో ముఖ్యంగా సరుకులు, బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర వంట సరుకులన్నీ నాణ్యమైనవి మాత్రమే తీసుకోవాలని, బియ్యంలో ఎలాంటి పురుగులు వచ్చినా, కాలం చెల్లిన సరుకులను సైతం రిటర్న్ చేసేలా రిజిస్టర్ మెయింటేన్ చేయాలన్నారు.
బియ్యం, వంట సరుకులు భద్రపరిచే గదుల్లో ఎలుకలు, బొద్దింకలు, క్రిమికీటకాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భోజన సిబ్బంది రుచికరంగా వండే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యాసంస్థల్లో ఆహారం తయారు కాగానే టెస్టింగ్ అధికారిని నియమించాలన్నారు. కిచెన్ షెడ్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి విద్యాసంస్థల్లో భోజన మెనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అంగన్వాడీల్లో సైతం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు.
విద్యాసంస్థల్లో పిల్లలు వ్యాధుల బారిన పడకుండా తరచూ క్యాంప్లు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని మందులు అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ఆహారం బాగాలేదని, పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, ఏ చిన్న వార్త వచ్చినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, ఒక్కొక్కటిగా ప్రాధాన్యత మేరకు పరిష్కరిస్తామని కలెక్టర్లు మనుచౌదరి, రాహుల్రాజ్ హామీనిఇచ్చారు. సమావేశంలో సిద్దిపేట, మెదక్ అదనపు కలెక్టర్లు అబ్ధుల్ హమీద్, మెంచు నగేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.