మద్దూరు(ధూళిమిట్ట), జనవరి12: పీహెచ్‌సీల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట జిల్లా మద్దూరులోని పీహెచ్‌సీతో పాటు లద్నూర్ పీహెచ్‌సీని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆమె ఆరాతీశారు. లద్నూర్‌లో అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించగా మెడికల్ ఆఫీసర్ సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలుపడంతో మెడికల్ ఆఫీసర్ సెలవుకు మీ అనుమతి తీసుకున్నారా అని ఫోన్లో డీఎంహెచ్‌వో ధన్‌రాజ్‌తో మాట్లాడి ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు సెలవులు కావాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలని, ఇష్టానుసారంగా లీవ్ తీసుకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
లద్నూర్ పీహెచ్సీ అపరిశుభ్రంగా ఉండడం చూసి అటెండర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం మద్దూరు పీహెచ్‌సీని కలెక్టర్ సందర్శించి అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. పీహెచ్సీలో అటెండర్ లేక ఇబ్బందులు పడుతున్నామని మెడికల్ ఆఫీసర్ మహేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి చర్యలు తీసుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఆయూష్ ఆరోగ్య మందిర్‌లో డాక్టర్ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. పీహెచ్‌సీల్లో సదుపాయాలు సమకూర్చుకొని రోగులకు ఓపికగా వైద్యం అందించాని కోరారు. మద్దూరు, లద్నూర్ పీహెచ్‌సీలను మరోసారి సందర్శించనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు.