మెదక్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయ న జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ ఐడీవోసీ నుంచి అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షా వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం, మున్సిపాలిటీల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని, తెల్ల రేషన్‌కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు లింక్ ఉన్న దరఖాస్తుదారులకు ఇప్పటికే ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గృహజ్యోతి కింద ఎంపికైన లబ్ధిదారులకు జీరోబిల్లులు పంపిణీ చేస్తున్నామని, ప్రజా పాలన దరఖాస్తు సమయంలో వివరాలు సరిగ్గా నమోదు చేయని వారు ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా సమర్పించవచ్చని సూచించారు. ఒక తెల్ల రేషన్ కార్డుపై ఒక గ్యాస్ కనెక్షన్, ఒక విద్యుత్ మీటర్ కనెక్షన్‌కు మాత్రమే గ్యారెంటీ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా జిల్లా పరిస్థితుల గురించి వివరించారు.