చేర్యాల, ఆగస్టు 12: ‘గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. జలాలను ఎత్తిపోసేందుకు మోటార్లు, పం పులు ఉన్నాయి…పంపింగ్ చేసిన నీటి కోసం రిజర్వాయర్లు, నీళ్లు పారించేందుకు కాల్వలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు గోదావరి నీటిని సముద్రం పాలు చేస్తుంది. అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్స్‌లో సోమవా రం చేర్యాల, చేర్యాల టౌన్, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాలకు చెందిన 147 మం దికి రూ.39,01,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చె క్కులను ఆయన బాధితులకు అందజేశారు.
ఈ సం దర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధకుడు కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దండగ చేసిందని, ఇప్పటివరకు రైతులకు రైతుబంధు అందించలేదన్నారు. రైతులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్లకు గోదావరి జలాలు పంపింగ్ చేసి వాటిని కాల్వల ద్వారా చెరువులు నింపితే భూగర్భజలాలు పెరిగి రైతులు పంటలు సాగు చేసుకునే వారని, గోదావరి జలాలు ఎత్తిపోస్తే కరెంట్ బిల్లు ఖర్చవుతుందని రైతన్నల కన్నీళ్లు తెప్పిస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రంలో 20లక్షల ఎకరాలు ఉన్న వ్యవసాయసాగు కేసీఆర్ రైతులకు నీళ్లు, కరెంట్, రైతుబంధు తదితర వాటిని అందించడంతో అదికాస్తా 70లక్షల ఎకరాలకు చేరిందన్నారు. చేర్యాల రెవె న్యూ డివిజన్ ఈ ప్రాంత ప్రజల సహకారంతో తప్పక సాధిస్తానని, డివిజన్ ఏర్పాటు అంశాన్ని ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడినట్లు తెలిపారు. తపాస్‌పల్లి, లద్దూనూరు రిజర్వాయర్లు నింపాలని అసెంబ్లీలో పోరాటం చేశానని, త్వరలో గోదావరి జలా లు రానున్నట్లు తెలిపారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఎత్తుకుపోతున్నారని కొందరు అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు.
సిద్దిపేటలోని రంగనాయకసాగర్ నుంచి ధూళిమిట్ట, చేర్యాల మండలంలోని కొన్ని గ్రామాలకు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు అభివృద్ధి కోసం చేర్యాలకు నిధులు మంజూరు చేయిస్తే కొందరు తమ ఇంటి ముందు, కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత దవాఖాన నీలిమాలో ఉచిత వైద్యం కొనసాగుతుందని, నిత్యం నియోజకవర్గానికి చెందిన 350 మంది రోగులు వస్తున్నారని వారి కోసం దవాఖాన ఆవరణలో ప్రత్యేక హాల్ నిర్మించినట్లు తెలిపారు.
పార్టీలకతీతంగా దవాఖానలో వైద్య సేవలు కొనసాగుతాయన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతోపాటు కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భూ కబ్జాలు అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని వెలుగులోకి తీసుకువస్తానన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, ముస్త్యాల నాగేశ్వర్రావు,
మేక సం తోష్, మంద యాదగిరి, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశం, మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మం డల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, తలారీ కిషన్, వకులాభరణం నర్సయ్యపంతులు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలుయాదవ్, గదరాజు చందు, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, బూరగోని తిరుపతిగౌడ్, తాడెం రంజిత, పచ్చిమడ్ల మానసతో పాటు నాలుగు మం డలాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.