నమస్తే తెలంగాణ, నెట్వర్క్: రాష్ట్రంలో పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పలుచోట్ల వివిధ రకాల పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 8.7, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 16.1, మంచిర్యాల జిల్లాలో 9.6, నిర్మల్ జిల్లాలో 0.2 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆయా జిల్లాల్లో అకాల వర్షాలు పత్తి, పుచ్చ, మామిడి, జొన్న, బొప్పాయి, వరి పంటలను దెబ్బతీసింది. రైతులు కల్లాలు, ఇండ్లలో ఆరబోసుకున్న పెసర, పసుపు పంటలు తడిసిపోయాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండురోజులపాటు కురిసిన అకాల వాన అపార నష్టాన్ని తెచ్చి పెట్టింది. వీణవంక మండలంలో 50 మంది రైతులకు చెందిన 260 ఎకరాల్లో మక్క నేలకొరిగింది.
శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలో చింతిరెడ్డి ఆదిరెడ్డి ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై భారీ పిడుగుపడి, మంటలు చెలరేగి దగ్ధమైంది. కరీంనగర్ రూరల్ మండలంలో 20 ఎకరాల్లో మక్కకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం, వెన్నంపల్లి, గంగారం, మంగపేట గ్రామాల్లో సుమారు 500 ఎకరాల మక్క పంట నేలకొరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కొందుర్గు మండల కేంద్రంలో మక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని మండలాల్లో చేతికొచ్చిన మక్కజొన్న నేలవాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన మక్కజొన్న, మిర్చి తడిసిపోయింది.