కొందుర్గు, మార్చి 18 : రేడియల్ రోడ్డు నిర్మాణంకోసం వ్యవసాయ భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని ఉమ్మెంతాల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభకు షాద్‌నగర్ ఆర్డీవో సరిత హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే కొందుర్గు మండలంలో 39.9 ఎకరాల భూమి 60 మంది రైతులు, చౌదరిగూడ మండలంలో 33.24 ఎకరాల భూమిని 91మంది రైతులు కోల్పోతున్నట్టు అధికారులు చదివి వినిపించారు.
ఉమ్మెంతాల, లాలాపేట రైతులు స్పందిస్తూ తమకు రేడియల్ రోడ్డు నిర్మాణం అవసరం లేదని అన్నారు. తమ భూములు గుంజుకొని రోడ్లు వేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భూములు తీసుకుంటే తమ బతుకుదెరువు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కాదని మొండికేస్తే తాము ట్రాక్టర్లతో రోడ్డును దున్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో తహసీల్దార్లు ఆజంఅలీ, జగదీశ్వర్, ఎస్సైలు రవీందర్‌నాయక్, విజయ్, లచ్చంపేట సర్పంచ్ సునీత పాల్గొన్నారు.