హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లపై నిలదీస్తుంటే జీర్ణించుకోలేక బజారు భాష మాట్లాతున్న రేవంత్‌రెడ్డి.. బూతుల ముఖ్యమంత్రి అని మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారెంటీల పేరు చెప్పి ఓట్లు దండుకున్న రేవంత్‌రెడ్డిని మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపమంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినట్టుగా రేవంత్‌రెడ్డి తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగం ఓ విజన్ డాక్యుమెంట్లా ఉన్నదని సీఎం చెబుతున్నా, భూతద్దం పెట్టి వెతికినా ఏం కనిపించదని నొక్కిచెప్పారు.
ఢిల్లీ ఏఐ సదస్సును గొప్పగా చెబుతున్న కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందని, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు నిరసన తెలిపారని హరీశ్‌రావు నిలదీశారు. గవర్నర్ ప్రసంగం చర్చలో ప్రభుత్వ పాలసీలను ప్రధాన ప్రతిపక్షంగా తప్పుబడితే అది రాజకీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పేదల పాలిట దయ్యంగా మారిన హైడ్రాను దేవతగా చూపించే ప్రయత్నం చేశారని, హైడ్రా రూల్స్ సీఎంకు నచ్చిన వారికి ఒకలా, లేనోళ్లకు మరోలా ఉన్నాయని, ఇకపై తాము కూడా సీఎం ద్వంద్వ ప్రమాణాలపై అసెంబ్లీలో వీడియోలు చూపిస్తామని, స్పీకర్ అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఎస్టీపీలను నాలాలపై కాకుండా ఎకడ కడుతారనే కామన్సెన్స్ కూడా సీఎంకు లేదని, మెట్రో విస్తరణకు అడ్డుపడింది, ఎల్అండ్టీని బ్లాక్మెయిల్ చేసింది రేవంత్‌రెడ్డేనని, ఇప్పుడు ఉల్టాచోర్ కొత్వాల్ డాంటే అన్నట్టుగా ఆయన తీరున్నదంటూ నిప్పులు చెరిగారు. కేంద్రం చెబితే మెట్రో స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న రేవంత్ మరి, మెట్రో విస్తరణ ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. ఓఆర్ఆర్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు రహదారులను ప్రైవేట్ అప్పగించిన విషయం తెలియని అజ్ఞాని అని హరీశ్‌రావు మండిపడ్డారు.
వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేతకాని సీఎం.. విజన్ 2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదమని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మనసు ప్యూర్‌గా లేనప్పుడు క్యూర్, ప్యూర్, రేర్ అని ఎంత మాట్లాడినా లాభం లేదని చురకలంటించారు. నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ కేసీఆర్ ఘనత అని, కానీ తానేదో సాధించినట్టు రేవంత్ బిల్డప్ ఇవ్వడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుకిచ్చిన హామీలు నెరవేర్చని వాడు రైతును రాజు చేస్తాడా? హామీలను ఎగ్గొట్టి ఈ రోజు అసెంబ్లీలో రైతులకు ఏదో చేశామని అబద్ధాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైట్‌కాలర్, బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడం కాదు.. వైట్‌కాలర్, బ్లూకాలర్ నేరాలకు పాల్పడడం రేవంత్ నైజమని, తాము సోనియాగాంధీని మెచ్చుకున్న రోజు ఇదే రేవంత్ బలిదేవత అన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంవో నుంచి డబ్బులిచ్చి ఫేక్ అకౌంట్లు నడుపుతున్న రేవంతా బీఆర్ఎస్ సోషల్ మీడియాను విమర్శించేదని ప్రశ్నించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలని చెప్పారని అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కే దికు లేకుండా పోయిందన్నారు. రెండేండ్లలోనే తాము 3లక్షల 47వేల కోట్ల పైనే అప్పులు తెచ్చామని సీఎం స్వయంగా చెప్పారని, ఆ లెకన ఐదేండ్లలో 8లక్షల కోట్లు దాటుతాయని, అప్పులపై మాట్లాడే నైతిక హకు ఉందా? అని హరీశ్‌రావు నిలదీశారు. మతి తప్పి అసహనంతో, అనాగరిక భాషతో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీని భ్రష్టు పట్టించారని, తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి సీఎంను ఏం చేసినా తప్పులేదని నిప్పులు చెరిగారు.