సిద్దిపేట, అక్టోబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఎగవేతలు, పథకాలు బంద్ నడుస్తున్నదని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలి.. రావాలి అని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 297 మందికి ఆదివారం సీఎం సహాయనిధి చెకులను అందచేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 వేల మందికి రూ.40 కోట్ల మేరు సీఎంఆర్ఎఫ్ సహాయం అందించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నదని, ప్రభుత్వ దవాఖానలు ఆధ్వానంగా తయారైనట్లు చెప్పారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రీషన్ కిట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందని, ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటి వరకు మకల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 8 నెలల నుంచి వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు వేతనాలు ఇచ్చే స్థితిలో లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేమి సేవలు చేస్తుందని విమర్శించారు.
ఉచిత బస్ అని పెట్టి భార్యలకు ఫ్రీ అని, భర్తలకు డబుల్ టికెట్ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. కచ్చితంగా వచ్చేది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.